తాడిపత్రిలో కొత్త కుంపటి.. జేసీ వర్సెస్ ఏఎస్పీ.. !
ఇక, గత 16 మాసాలుగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ నియోజకవర్గాన్ని మరింత పతాక స్థాయికి చేర్చారు. అభివృద్ధి మాటేమో కానీ.. రాజకీయ దుమారం విషయంలో తాడిపత్రి నియోజకవర్గం పెద్ద సమస్యాత్మక నియోజకవర్గంగా మారిందని.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబే వ్యాఖ్యానించారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అని పల్లాశ్రీనివాసరావును ఆరా తీశారు. దీనికి ఆయన నవ్వి.. అంతా మామూలే సర్! అని సమాధానం ఇచ్చారు.
అంటే...తాడిపత్రి విషయంలో టీడీపీ కూడా అంతా మామూలే అని నిర్ణయానికి వచ్చేసింది. సొంత పార్టీ నాయకులతో వివాదాలు.. లేకపోతే.. వ్యాపారాల విషయంలో ఆగడాలు.. ఇసుక రవాణా.. సహా అనేక అంశాలు ఎప్పుడూ తాడిపత్రి కేంద్రంగా రాజకీయ వివాదం జరుగుతూనే ఉంది. తాజాగా తాడిపత్రిలో ఏఎస్పీ వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మరింత దుమారం రాజుకుంది. పోలీసుల జోలికొస్తే తాట తీస్తానంటూ ఏఎస్పీ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.
దీనికి ముందు... తాడిపత్రిలో ఏఎస్పీని కార్నర్ చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని.. ఆయన వల్ల నియోజకవర్గం నాశనం అయిందని అన్నారు. అంతేకాదు.. ఎస్పీని చూసి ఊరుకుంటున్నామని.. లేకపోతే.. ఇంటికెళ్లి.. ఏదో చేసేవారమని కూడా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు ఏఎస్పీకి.. జేసీకి మధ్య అగాధం సృష్టించాయి.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న ఏఎస్పీ వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవుతూ.... నువ్వు బయటికి రావాలంటే ఎస్ఐ, కానిస్టేబుల్ కావాలి.. రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా పనికిరాడు.. తాడిపత్రిలో నువ్వు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గలేదు.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గింది అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ..పోలీసులు కూడా నిశితంగా గమనిస్తున్నారు. ఏదేమైనా.. తాడిపత్రి వ్యవహారం మరోసారి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందనే చెప్పాలి.