జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠకరంగా మారింది. అందుకే రాజకీయ వర్గాలు, న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా అందరూ ఈ ఉప ఎన్నిక ఫలితంపై గట్టి చర్చలు సాగిస్తున్నారు. ఈ ఎన్నిక ముఖ్యంగా అధికార కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు రిఫరెండంగా చెపుతున్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయో, అభివృద్ధి ఏ స్థాయిలో కొనసాగుతోందో కూడా ఈ ఉప ఎన్నికలో ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు వెలువడుతున్న ఆర్.ఆర్. పొలిటికల్ సర్వీస్ సర్వేలు చూస్తే, కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికలో కొంత ఆధిక్యం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో 2023లో అర్బన్ లో కాంగ్రెస్ పెద్దగా సీట్లు సాధించలేదు, జూబ్లీహిల్స్‌లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు. అంతేకాక, మూడు సార్లు గోపీనాథ్ గెలిచారు. ఇప్పుడు ఆయన భార్యనే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని నిలబెట్టారు. బీఆర్ఎస్‌కి బలమైన క్యాడర్ ఓటు బ్యాంక్ ఉండటంతో, కొంతమంది ఈ ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందంటూ ఊహించుకున్నారు.
కానీ సర్వే ఫలితాలు చూస్తే, కాంగ్రెస్‌కు కొంత ఎడ్జ్ ఉందని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం నవీన్ యాదవ్. నవీన్ స్థానిక నాయకుడిగా బలంగా ప్రస్థానం చేస్తున్నారు. సామాజికంగా బలమైన, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందాడు. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలైనా... ఇప్పుడు ఆ సానుభూతి బాగా కలిసి వస్తోంది. పైగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అందరికి అందుబాటులో ఉన్నాడు. ఇంకా, మజ్లీస్ మద్దతు కూడా ఈ ఎన్నికలో కాంగ్రెస్‌కు ఉపకారం చేస్తోంది. బీసీ + ముస్లిమ్ వోటు బ్యాంక్‌ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కచ్చితమైన వ్యూహం తీసుకుంది. ఫలితంగా, కొన్ని విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, నవీన్ యాదవ్‌కు ఈ ఉప ఎన్నికలో అధిక అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే, బీఆర్ఎస్ నుంచి గులాబీ పార్టీ కూడా హోరా హోరీ పోరుకు సిద్ధంగా ఉంది. అయితే సర్వే ఫలితాల ఆధారంగా, నికరంగా చూస్తే ఫలితం నవీన్ యాదవ్‌కి అనుకూలంగా ఉంటుందనే ఊహ ఉంది. ఇంకో విషయం స్పష్టమయిందంటే, ఈసారి నవీన్ కాకుండా వేరే అభ్యర్థిని కాంగ్రెస్ పోటీ చేయిస్తే ఫలితం కాంగ్రెస్‌కు అంత సానుకూలంగా ఉండదన్న చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఫైనల్ గా గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ, వ్యూహాలు, సామాజిక మరియు వోటు ఫాక్టర్స్ మొత్తం కలిసి ఈసారి కాంగ్రెస్‌కు కొంత మొగ్గు ఉందని చెబుతున్నారు. కానీ తుది ఫలితం ఎలా ఉండబోతోందో ? చూడాలి.