తెలంగాణ‌లో బిగ్ పొలిటిక‌ల్ డ్రామా... రేవంత్ రెడ్డే క్లీ ప్లేయ‌ర్‌...!

RAMAKRISHNA S.S.
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సుప్రీంకోర్టు ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ నెలాఖరులోపు ఈ వ్యవహారంపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని, న్యాయ నిపుణుల సలహా తీసుకుని స్పష్టమైన వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. దీంతో స్పీకర్ ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటారన్నదానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆస‌క్తిగా మారింది. ఈ పరిణామాల మ‌ధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముందడుగు వేసి, ఆ పది మంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కడియం శ్రీహరి అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోయినా, మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉపఎన్నికల అవకాశాలపై కూడా సీఎం రేవంత్ వారితో స్పష్టంగా చర్చించినట్లు సమాచారం. తాను ఎప్పటికప్పుడు చెబుతున్నట్లుగానే “ఆరు నెలలలో ఉపఎన్నికల పరిస్థితి రాదు” అనే భరోసాను మరోసారి ఇచ్చార‌ని టాక్ ?  వ్యూహాత్మకంగా ఉపఎన్నికలకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చ సాగిందని తెలుస్తోంది.


ప్రత్యేకంగా జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే నమ్మకాన్ని రేవంత్ వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఆ విజయం పార్టీకి కొత్త ఊపుని తెస్తుందని, అదే సమయంలో బీఆర్ఎస్‌లో అంతర్గత సమస్యలు మరింత ముదురుతాయని రేవంత్ ప్లాన్‌గా తెలుస్తోంది. అప్పుడు ఉపఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశముందని ఎమ్మెల్యేలతో పంచుకున్నట్లు సమాచారం. ఇక స్పీకర్ ముందున్న మార్గాల విషయానికి వస్తే రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకటి, ఎమ్మెల్యేల నుంచి “మేము పార్టీ మార్చలేదు” అనే వివరణ తీసుకుని బీఆర్ఎస్ పిటిషన్లను తిరస్కరించడం. మరోటి, పరిస్థితులు అనర్హత వేటు దిశగా వెళితే, వారిని రాజీనామాలు చేయించి సమస్యను పరిష్కరించడం. నేరుగా అనర్హత విధించడం రాజకీయ పరంగా స్పీకర్‌కు సాహసమే అవుతుంది. అందుకే రాజీనామా ఆప్షన్ ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది.


ఈ నేపధ్యంలో సీఎం రేవంత్ ఆ పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్తుపై పూర్తి భరోసా ఇచ్చారు. వారి రాజకీయ ప్రయాణం సజావుగా సాగేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక తరువాత బీఆర్ఎస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి, కాంగ్రెస్‌లో విలీనం ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచన కూడా రేవంత్ వద్ద ఉందని సమాచారం. మొత్తానికి, ఈ సంక్షోభ పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డే తుది కీ ప్లేయర్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: