దాయాది గుండెల్లో బెలూచ్ రైళ్లు.. మోడీజీ, ఆ ఒక్క ఆయుధం ఇవ్వండి, పాకిస్థాన్ అంతు చూస్తాం?

praveen
భారతదేశంతో కయ్యానికి కాలుదువ్వి కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు సొంతగడ్డపైనే పెను సవాల్ ఎదురవుతోంది. ఒకవైపు భారత దాడుల భయంతో ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ, లాహోర్ నగరాలు వణికిపోతుంటే, మరోవైపు బెలూచిస్తాన్ విముక్తి సేన (బీఎల్ఏ) పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తోంది. క్వెట్టాలో పాక్ సైన్యాన్ని తరిమికొట్టి, నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని బీఎల్ఏ ప్రకటించడంతో దాయాది దేశంలో ప్రకంపనలు మొదలయ్యాయి.

భారతదేశం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ సైన్యానికి, బెలూచిస్తాన్‌లో బీఎల్ఏ రూపంలో మరో తలనొప్పి వచ్చిపడింది. బెలూచిస్తాన్‌లోని క్వెట్టాలో పాక్ సైనిక దళాల ఫ్రాంటియర్ కోర్ కార్యాలయంపై బీఎల్ఏ యోధులు మెరుపువేగంతో దాడి చేసి, పాక్ సైనికులను పరుగులు పెట్టించారని సమాచారం. ఈ దెబ్బతో పాక్ సైన్యం వెన్నుచూపి పలాయనం చిత్తగించిందని బీఎల్ఏ వర్గాలు గర్వంగా చెబుతున్నాయి.

తమ పోరాటం ఫలించిందని, త్వరలోనే బెలూచిస్తాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, స్వతంత్ర పతాకాన్ని ఎగురవేస్తామని బీఎల్ఏ అగ్గిమీద గుగ్గిలంలా ప్రకటిస్తోంది. ఈ కీలక తరుణంలో, బెలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన కొందరు ప్రతినిధులు, పౌరులు, మరియు పోరాట యోధుల నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఒక అభ్యర్థన అందినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నదే తమ లక్ష్యమని, దీనికోసం భారత్ తక్షణమే సైనిక సహాయం అందించాలని వారు కోరుతున్నారు. పాకిస్థాన్ భూభాగంలో సుమారు 46 శాతం విస్తరించి ఉన్న బెలూచిస్తాన్, విదేశీ అండదండలు, ఆయుధ సంపత్తి లేనిదే పోరాటం సాగించలేకపోయామని అంటోంది. అందుకే, "మోడీ, మాకు తక్షణమే క్షిపణులు అందించండి. ఆ తర్వాత మేం ఎలాంటి అద్భుతాలు చేసి చూపిస్తామో మీరే చూస్తారు" అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు.

కొంతకాలంగా పాకిస్థాన్ సైన్యానికి ముచ్చెమటలు పట్టిస్తున్న బీఎల్ఏ, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 200 మందికి పైగా పాక్ సైనికులను మట్టుబెట్టి తమ సత్తా చాటుకుంది. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, బీఎల్ఏ మరింత దూకుడుగా పాకిస్థాన్‌పై పంజా విసురుతుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో పాకిస్థాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. బెలూచ్ పోరాటానికి భారత్ చేయూత అందిస్తే, పాకిస్థాన్ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: