పవన్‌కు కొత్త తలనొప్పి.. స్మశానాన్ని కూడా వదలరా.. ధర్మవరంలో రచ్చ రచ్చ?

praveen
అధికారం మారిందో లేదో అప్పుడే కొందరి నేతల తీరు వివాదాస్పదమవుతోంది. సాక్షాత్తూ ప్రజలు పవిత్రంగా భావించే స్మశాన వాటికపైనే కన్నేసి, కబ్జాకు యత్నించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వెలుగుచూసి తీవ్ర కలకలం రేపింది. జనసేన పార్టీకి చెందిన స్థానిక నేత ఒకరు ఏకంగా నకిలీ పత్రాలు సృష్టించి, రిజిస్ట్రేషన్ చేయించి మరీ స్మశాన వాటికను మింగేయాలని చూడటం స్థానికులను నివ్వెరపరిచింది. ఈ పరిణామం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, పార్టీ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారింది.

ధర్మవరం పట్టణంలోని ఎల్‌సీకే పురం, సర్వే నెంబర్ 649... ఇక్కడ దశాబ్దాల క్రితం భవన నిర్మాణ కార్మికుల ఇంటి స్థలాల కోసం ప్రభుత్వం సుమారు 30 ఎకరాలు కేటాయించింది. ఆ కేటాయింపులు పోగా, మిగిలిన రెండు ఎకరాలకు పైబడిన భూమిని 2002లోనే ప్రభుత్వం స్మశాన వాటిక కోసం అధికారికంగా కేటాయించింది. అప్పటినుంచి ఆ చుట్టుపక్కల కాలనీల ప్రజలు అంత్యక్రియల కోసం ఈ స్థలాన్నే వినియోగించుకుంటున్నారు. ఇదొక సున్నితమైన, ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అంశం.

ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ మారింది. ఇదే అదనుగా భావించిన జనసేన నాయకుడు తొండమాల రవికి ఆ విలువైన స్మశాన వాటిక భూమిపై కన్నుపడింది. ఇంకేముంది, పక్కా ప్లాన్‌తో పావులు కదిపాడు. తన బినామీల పేర్లతో నకిలీ పట్టాలు సృష్టించి, ఏకంగా ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించి అక్రమంగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.

శనివారం నాడు తొండమాల రవి మరింత బరితెగించాడు. జేసీబీ యంత్రాన్ని తీసుకొచ్చి ఆ స్మశాన వాటిక స్థలాన్ని చదును చేయించేందుకు సిద్ధమయ్యాడు. ఇది గమనించిన స్థానిక ప్రజలు అవాక్కయ్యారు. తరతరాలుగా వాడుకుంటున్న స్మశానాన్ని ఇలా ధ్వంసం చేయడమేంటని నిలదీశారు. అది తమ స్థలమంటూ రవి బుకాయించడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే జేసీబీని అక్కడినుంచి తీసుకెళ్లాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. పనులను పూర్తిగా అడ్డుకున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం బాధితులైన స్థానికులు పట్టణ పోలీస్ స్టేషన్‌లో జనసేన నేత రవిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. దశాబ్దాలుగా ఉన్న స్మశాన వాటికను అక్రమార్కుల బారి నుంచి కాపాడాలని, తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.

ఒకవైపు పవన్ కళ్యాణ్ అవినీతి రహిత పాలన గురించి మాట్లాడుతుంటే, క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. సొంత పార్టీ నేతలే ఇలాంటి ఆరోపణల్లో చిక్కుకోవడం అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, అవి ప్రత్యర్థి మీడియాలో వచ్చినా సరే, పార్టీ అంతర్గతంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని, వాస్తవాలను నిర్ధారించుకుని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధర్మవరం ఘటనపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: