దేశంలోనే ఆ రికార్డు దిశ‌గా మంగ‌ళ‌గిరి - తాడేప‌ల్లి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌...!

RAMAKRISHNA S.S.
స్వచ్ఛ మంగళగిరి ఉద్యమంలో నియోజకవర్గ ప్రజలు భాగస్వాములు కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్‌కు అధికారులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. మొదట మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత స్టాల్స్‌ను పరిశీలించారు. డ్రాయింగ్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు. స్వచ్చ మంగళగిరి పోస్టర్‍ను, బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. అధికారులు, నాయకులు, విద్యార్థులతో స్వచ్ఛ మంగళగిరి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని అన్నారు. మన ఇంటి నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణ భాద్యత మనమే తీసుకోవాలన్నారు.

మన ఇంట్లో వెలువడే చెత్తను బహిరంగ ప్రదేశాలలో, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో వేయకుండా ప్రతి రోజు మన ఇంటి ముందుకు వచ్చే నగరపాలక సంస్థ వాహనాలకు అందజేసి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని స్వచ్చ మంగళగిరిగా మార్చాలన్న ఉద్దేశ్యంతో స్వచ్చ-మంగళగిరి కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్లు చెప్పారు. నేను కోరిన వెంటన SAEL, సంస్థ, దివిస్ సంస్థలు సీఎస్‌ఆర్ కింద నిధులు ఇవ్వడంతో పాటు స్వచ్చ మంగళగిరికి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. SAEL సంస్థ రూ. కోటి 25 లక్షలతో అన్ని సచివాలయాలకు శానిటేషన్ కిట్స్ అందజేయగా, దివిస్ సంస్థ స్వచ్చ అంబాసిడర్స్‌కి జీతాలు చెల్లిస్తున్నారని అన్నారు.

ఏడాదిలోగా ఎంటీఎంసీని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతాం
స్వచ్చ-మంగళగిరి ప్రత్యేక డ్రైవ్ ద్వారా 365 రోజుల్లో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ను దేశంలోనే చెత్త రహిత కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. దీని కోసం అందరిలోను చైతన్యం రావాలన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉంటాయన్నారు. అందుకోసమే మంగళగిరిలో పార్కులు, చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన కిట్స్ అందజేయడం జరుగుతుందని అన్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంద‌న్నారు.

త్వరలో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అక్కడక్కడ డ్రైనేజీలు పూడుకుపోవడానికి మనం వేసే వ్యర్థాలే కారణమన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. నెల రోజుల్లో అన్ని సచివాలయాల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా పారిశుద్ధ్యంపై ఇంటింటి అవగాహన కల్పించడం  పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అందుకోసం అన్ని సచివాలయాలకు పారిశుద్ధ్య కిట్స్ అందజేయడంతో పాటు 70 మంది అదనపు పారిశుద్ధ్య కార్మికులను తాత్కాలికంగా నియమించడం జరిగిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: