అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే రూ.57 లక్షలు జీతం తీసుకున్న కేసీఆర్‌.. దులిపేసిన సీఎం రేవంత్..?

praveen
ప్రతిపక్ష నేతగా, ముఖ్యమైన రాజకీయ నాయకుడిగా ఉన్న మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు అసెంబ్లీకి రాకపోవడంపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ అసలు సభకే రాకపోవడం ఏంటని నిలదీస్తున్నారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై చాలా ఘాటుగా మాట్లాడారు. కేసీఆర్ అసెంబ్లీకి సరిగ్గా రావడం లేదని ఎండగట్టారు. పెద్ద పదవిలో ఉండి కూడా గత 15 నెలల్లో కేవలం రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని లెక్కలు తీసి మరీ చెప్పారు. కానీ, ప్రజల సొమ్ముతో మాత్రం జీతం, ఇతర అలవెన్సులు కలిపి ఏకంగా రూ.57,84,124 తీసుకున్నారని తేల్చి చెప్పారు. ఇది డిసెంబర్ 2023 నుంచి 2025, ఫిబ్రవరి 28 వరకు లెక్క అని తెలిపారు.

సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఎలాగైతే ఆఫీసుకు వచ్చి పనిచేస్తారో, కేసీఆర్ కూడా అలాగే అసెంబ్లీకి వచ్చి తన బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ చర్చలకు రావడం లేదు, కనీసం తన నియోజకవర్గానికో లేక రాష్ట్రంలో వేరే ప్రాంతాలకో వెళ్లి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కరోనా టైంలో చాలామంది ఉద్యోగులు "వర్క్ ఫ్రమ్ హోమ్" చేశారు. కానీ రాజకీయాల్లో అలాంటి వెసులుబాటు ఉండదని రేవంత్ రెడ్డి అన్నారు. "ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. మరి రాజకీయ నాయకులకు 'వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్' ఆప్షన్ ఉందా?" అంటూ కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.
కేసీఆర్ తన బాధ్యతలను గాలికి వదిలేశారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రజల కోసం పనిచేయాలని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం ద్వారా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను సరిగా చేయడం లేదని దుయ్యబట్టారు.
అంతేకాదు ఢిల్లీకి వెళ్తే తనని అనవసరంగా విమర్శిస్తున్నారని, వీళ్లు కనీసం ప్రధానమంత్రి అనే గౌరవం కూడా ఇవ్వకుండా ఢిల్లీకి వెళ్లడమే మానేశారని కూడా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో చాలామంది ఏకీభవిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: