హెరాల్డ్ పాలిటిక్స్ 2024 : తెలంగాణ రాజకీయాలకు.. ఎంటర్టైనర్ ఆయనొక్కడే.. ఏం మాట్లాడిన నవ్వులే నవ్వులు?
* కానీ ఆయన మాటలు వింటే పొట్ట చెక్కలు అవడం ఖాయం
* అంతటి మహా ఎంటర్టైనర్ అతను
(తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం మాట్లాడినా అది తెగ వైరల్ అయిపోతుంది. ఎందుకంటే అంత ఫన్నీగా ఆయన మాట్లాడటం జరుగుతుంది. పాలమ్మిన పూలమ్మిన అని ఆయన నోట వినిపించే డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ హిట్ అయింది. సినిమా డైలాగులు కంటే ఈ నేత డైలాగే ఎక్కువగా ప్రజల నోళ్లలో నానుతుంటుంది. ఇదొక్కటే కాదు ఆయన అన్ని స్పీచ్ లలో ఇలాగే పంచింగ్ ప్రసంగాలు ఇస్తుంటారు. మల్లారెడ్డి 30 ఏళ్ల కిందట మామూలు స్కూటర్ పై రోజూ పాలు పోస్తూ బతికేవారు. అలా అత్యంత సాధారణంగా చేతక్ బండి పై జీవితాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతగా మారారు, అంతేకాదు, సంపన్నుడిగా నిలుస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా కనిపిస్తున్నారు. అసెంబ్లీలో మంత్రి మల్లారెడ్డి చెప్పే ముచ్చట్లు అయితే ప్రతిపక్ష నేతలను కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. అంతటి మహా మాటకారి ఆయన.
మల్లారెడ్డికి ఇప్పుడు 71 ఏళ్లు. అయినా కుర్రాడి లాగా డ్యాన్స్ చేస్తారు. మొన్న మనవరాలి పెళ్లిలో డీజే టిల్లు పాటకు స్టెప్పులేసి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఈ ఏడాది ఎక్కువగా హైలైట్ అయిన రాజకీయ నేతగా ఈయన నిలిచారు. ఈ పొలిటీషియన్ మల్లారెడ్డి యూనివర్సిటీ పేరిట ఒక విద్యా సంస్థను కూడా నడుపుతున్నారు. ఆ యూనివర్సిటీకి తరచుగా వెళ్తుంటారు. అంతే కాదు తన ఫేమస్ డైలాగ్ కూడా చెప్పి విద్యార్థులలో మోటివేషన్ కలిగిస్తారు. ఈ ఏడాది బతుకమ్మ సందర్భంగా యూనివర్సిటీకి వెళ్లి అక్కడ విద్యార్థులతో కాలు కదిపి ఆశ్చర్యపరిచారు.
ఈ మేడ్చల్ ఎమ్మెల్యేని ఈ ఏడాది తీపే కాదు చేదు కూడా పలకరించింది. తన మెడికల్ కాలేజీల్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ సీట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనకు నోటీసులు పంపింది. ఇప్పుడు ఆయన ఈ లీగల్ కేసులో చిక్కుకున్నారు. అంతేకాదు ఆయన ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు వైద్యం చేసి ఒక మహిళ మరణానికి కారణమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో వచ్చిన మహిళకు సర్జరీ చేసే సమయంలో తప్పు చేశారని, దీనివల్ల తీవ్ర రక్తస్రావమయమే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఇందులో నిజమెంతో తెలియ రాలేదు కానీ కొంచెం నిప్పు లేనిదే పొగ వస్తుందా అని అప్పట్లో ఆయనపై విమర్శలు వచ్చాయి. ఈ రెండు ఘటనలు మినహాయించి మల్లారెడ్డికి ఈ సంవత్సరం మంచిగానే గడిచిపోయింది అని చెప్పుకోవచ్చు.