చిన్నగంజాంలో ఓడ‌ల త‌యారి ప‌రిశ్ర‌మ‌, గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్... కేంద్ర మంత్రి సోనోవాల్‌కు ఎమ్మెల్యే ఏలూరి లేఖ‌

RAMAKRISHNA S.S.
- గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఏర్పాటుకు అనువైన తీరం
- అందుబాటులో ఆక్వా,ఉప్పు ,గ్రానైట్,భారీ పరిశ్రమలు
- పరిశ్రమల నిర్మాణానికి అద్భుత అవకాశాలు
- భౌగోళిక, సహజ,మానవ వనరులకు పుష్కలంగా అవకాశం
- కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కు   ఎమ్మెల్యే ఏలూరి లేఖ
- కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే ఏలూరి లేఖను అందజేసిన మారిటైం బోర్డ్ చైర్మన్
- దామచర్ల సత్యకు ఎమ్మెల్యే ఏలూరి ధన్యవాదాలు


ఆంధ్రప్రదేశ్ లో పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం, మోటుపల్లి-పెద్దగంజాం సువిశాల  సముద్ర తీర ప్రాంతంలో ఓడల తయారీ పరిశ్రమ, గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కు లేఖ రాశారు. ఈ లేఖను గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ కు మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అందజేశారు. ఈ లేఖలో చిన్నగంజాం పరిధిలోని మోటుపల్లి - పెద్దగంజాం సముద్ర తీర ప్రాంతం ఓడల తయారీ పరిశ్రమకు, గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణ యూనిట్ అనువైన ప్రాంతంగా ఉందని చెప్పారు. భౌగోళికంగా అనువైన ప్రాంతమని, ఇక్కడ సహజ వనరులు,చదువుకున్న యువత,మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. మెరుగైన రవాణా వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రాజధానులకు దగ్గరలో ఈ ప్రాంతం ఉందన్నారు. ఇక్కడ బ్రిటిష్ కాలంలో పోర్టు కూడా ఉందని, ఇక్కడి నుంచి జల రవాణా ద్వారా సుగంధ ద్రవ్యాలు రవాణాకు పెట్టింది పేరుగా చరిత్రలో నిలిచిందన్నారు. ప్రధానంగా ఇక్కడ రొంపేరు కాలువ ద్వారా నీరు సముద్రంలో కలుస్తుందని,సముద్ర రవాణాకు మంచి వాతావరణం ఉందన్నారు.

మోటుపల్లి -పెద్దగంజాం సముద్ర తీర ప్రాంతం చిన్నగంజాం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. అలాగే నేషనల్ హైవే 216 కి అతి సమీపం,నేషనల్ హైవే-16 (చెన్నై-కోల్‌కతా కారిడార్) కు దగ్గరగా ఉందన్నారు. సముద్ర తీర ప్రాంతానికి రైల్వే లైన్ 7 కి.మీ దూరంలో ఉందని లేఖలో ప్రస్తావించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి,తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు,ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి (120 కి.మీ) దగ్గరలో ఉందన్నారు.ఎంతో చారిత్రాత్మకమైన జల రవాణా మార్గం బకింగ్ హామ్ కెనాల్ (2 కిలో మీటర్లు)కూత వేట దూరంలో ఉందని,గతంలో ఈ కాలువ ద్వారా ప్రపంచ దేశాలకు జల రవాణా జరిగిందని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో అన్ని అంశాలలో అనుకూలమైన సముద్ర తీర ప్రాంతం ఇదే కావడం గమనార్హం అన్నారు.బాపట్ల జిల్లా కేంద్రానికి, ప్రకాశం జిల్లా కేంద్రానికి రెండు జిల్లా కేంద్రాలకు అతి సమీపంలో ఈ ప్రాంతం ఉందని లేఖలో వివరించారు. బకింగ్హామ్ కాలువ వలన దేశీయ జలమార్గాల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని,దేశ, అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ద్వారా దక్షిణాసియా, చైనా మరియు మధ్య తూర్పు దేశాలకు సరుకు రవాణా చేయడానికి అనువుగా ఉంటుందని తెలిపారు.

ఇక్కడ సముద్ర మట్టం లోతు, స్థిరమైన ఇసుక, అనుకూలమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయన్నారు.ఆక్వా సాగుకు బాపట్ల జిల్లా పెట్టింది పేరని, రొయ్యల సాగు,ఉప్పు సాగుకు ఆశాజనకంగా ఉందని దేశ విదేశాలకు ఎగుమతులకు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుతో అనుకూలమన్నారు. పోర్టు అభివృద్ధి జరిగితే ఇక్కడ ప్రసిద్ధిగాంచిన గ్రానైట్ ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.మోటుపల్లి పెద్దగంజం ప్రాంతం ఓడలు తయారీ పరిశ్రమకు అన్ని సహజ వనరులు పుష్కలమని, ఇన్ని అనుకూలతల ఉన్న మోటుపల్లి పెద్దగంజాం సముద్ర తీర ప్రాంతాన్ని ప్రత్యేక బృందం ద్వారా పరిశీలించి , ఇక్కడ ఓడల తయారీ పరిశ్రమ పోర్టు నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి కోరారు. ఈ రెండు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి దేశానికి తలమానికంగా నిలుస్తుందని ప్రాచీన చరిత్రకు జీవం పోసి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని,భారత ప్రభుత్వ విజన్, అభివృద్ధికి ఈ ప్రాంతం ఎంతో దోహద పడుతుందని కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే ఏలూరి కోరారు.చిన్నగంజాం తీర ప్రాంతంలో ప్రజల చిరకాల స్వప్న ఓడల తయారీ పరిశ్రమ నిర్మాణానికి తనవంతు కర్తవ్యం గా బాధ్యతగా తీసుకొని కేంద్ర మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్ మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: