మద్యపాన నిషేధం మాటలకే.. ఎన్టీఆర్ లా సాహసం చేసే నాయకుడే లేడుగా..!!
* నిషేధ హామీలన్నీ మేనిఫెస్టోకే పరిమితం
* మద్యం పై ఎన్టీఆర్ లా సంచలన నిర్ణయం తీసుకునే నాయకుడే లేడుగా..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన పధకం ‘ మద్యపాన నిషేధం’.. ఈ పధకం అమలు చేయాలంటే ప్రస్తుత ప్రభుత్వల వల్ల కానీ పని అని చెప్పొచ్చు.. రాష్ట్రంలో మద్యంపై వచ్చే ఆదాయం భారీగా ఉంటుంది.. దీనితో మద్యపానం నిషేధం అమలు చేసే సాహసం ప్రస్తుత ప్రభుత్వాలు ఎప్పటికీ చేయవు.. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసిన ఒకే ఒక్క మొనగాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు..తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా పార్టీ పెట్టి 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా ఎన్నికయ్యారు. తాను అధికారంలో వున్నప్పుడు పేదలకు ఉపయోగపడే ఎన్నో పధకాలు ప్రవేశపెట్టారు.. అయితే ఎన్టీఆర్ 1989 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన పార్టీని గెలిపించలేకపోయారు.ఇదే సమయంలో రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది..దూబగుంట రోశమ్మ నాయకత్వంలో ఆనాడు మహిళలంతా ఏక తాటిపైకి వచ్చారు. ఈ పోరాటానికి పేద, గ్రామీణ స్త్రీల నుంచి మధ్యతరగతి, పట్టణ స్త్రీల వరకు మద్దతు లభించింది.
గాంధీజీ సిద్ధాంతాలను, ఆదర్శాలను అనుసరించే పురుషులు కూడా ఈ సంపూర్ణ మద్య నిషేధానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. స్త్రీలంతా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి తమ గ్రామాల నుంచి పోరాటాలు చేశారు.రోశమ్మ స్పూర్తితో కదిలిన ఆనాటి ప్రతిపక్షనేత ఎన్టీఆర్ తన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వస్తే ‘సంపూర్ణ మద్యపాన నిషేధం’ అమలు చేస్తామని ప్రకటించారు. ఆయన మాట మీద వున్న నమ్మకంతో ప్రజలు టీడీపీని అఖండ మెజారిటితో గెలిపించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 1995 జూన్ 1 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసి తన నిబద్దత చాటుకున్నారు..
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ లాగా గతంలో 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ కూడా మద్యాన్ని పూర్తిగా నిషేదిస్తామని హామీ ఇచ్చారు. అలా చెయ్యకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను అని చెప్పుకొచ్చారు.. దీనితో ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు..కానీ జగన్ హయాంలో మద్యం రేట్లు భారీగా పెరగటమే కాకుండా నాసిరకం మద్యం ఏరులై పారింది.. దీనితో ప్రజలు ఈసారి జగన్ ను నమ్మలేదు.. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నూతన మద్య పాలసీ తీసుకొచ్చింది.. దీని ప్రకారం మద్యం అతి తక్కువకే లభిస్తుంది. నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.. తగ్గిన ధరలతో మందుబాబులు ఖుషి అవుతున్నారు..సరికొత్త మద్య పాలసీతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం వుంది..