చింతలపూడి వైసీపీలో రాజకీయ శూన్యత.. అశోక్ ప్లేస్ భర్తీ అవుతుందా.. అంత గట్స్ ఉన్న లీడర్ ఎవరు ?
వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన అశోక్ చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. వైఎస్సార్ మరణాంతరం వైసీపీలోకి వెళ్లిన ఆయన 2014లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గ వైసీపీలో కీలకంగా మారారు. 2019 ఎన్నికలలో చింతలపూడి నియోజకవర్గంలో వైసిపి రికార్డులు బద్దలు కొడుతూ 36వేల భారీ మెజార్టీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గ రాజకీయాలను ఆసాంతం తన కనుసైగలతో శాసిస్తూ వచ్చారు. రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అశోక్ తన వర్గాన్ని కాపాడుకునే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అన్నిటికీ మించి రాష్ట్ర రాజకీయాలలో కోటగిరి అంటేనే ఒక బ్రాండ్.. దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు ఐదు సార్లు వరుసగా శాసనసభకు ఎంపిక కావడంతో పాటు రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.
ఆయన మరణం తర్వాత కోటగిరి కుటుంబ రాజకీయ చరిత్ర మరుగురు పడుతున్న వేళ విద్యాధర రావు వారసుడు కోటగిరి శ్రీధర్ బాబుని తెరమీదకు తీసుకువచ్చి వెన్ను తట్టి ప్రోత్సహించి ఎంపీగా పోటీ చేయాల్సిందే అని బలవంతం చేసి... 2019 ఎన్నికలలో ఏలూరు నుంచి వైసీపీ తరఫున అఖండ మెజార్టీతో శ్రీధర్‌ను గెలిపించి పార్లమెంటుకు పంపటంలో తెరవెనక శ్రీకృష్ణుడిలా అశోక్ ఎంతో కష్టపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్ సైతం అశోక్ అన్నా అని అప్యాయంగా పిలిచేంత చనువు ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధితో విబేధాలు వచ్చిన వేళ అశోక్.. ఓ సందర్భంలో జగన్‌తో మీట్ అయ్యారు.. వెంటనే నాకు పార్టీ మీద హక్కు లేదా అని జగన్‌తోనే అనేశారు.. జగన్ కాస్త స్టన్ అయినా ఎందుకు లేదు.. పార్టీ నీది అని చెప్పారు. అశోక్ అనారోగ్యంతో వైజాగ్‌లో చికిత్స పొందుతోన్న క్రమంలోనే ఫోన్ చేసిన జగన్ .. అశోక్ అన్నా కోలుకుని తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించినా అది సాధ్యం కాలేదు.. అశోక్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
అశోక్ ప్లేస్ భర్తీ చేసేదెవరు..?
వాస్తవానికి అశోక్ ఖచ్చితంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని.. చేయాలని ఆయన అభిమానులు గత ఆరేడేళ్లుగా కోరుకుంటున్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పడే జనరల్ నియోజకవర్గం నుంచి అశోక్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేసులో ఉంటారనే బలమైన ప్రచారం జరిగింది. అది పక్కన పెట్టినా ఇప్పుడు అశోక్ మృతితో కామవరపుకోట మండలం.. చింతలపూడి నియోజకవర్గంలో ఆయనలా పవర్ ఫుల్ రాజకీయం చేసే నాయకుడి కొరత వైసీపీకి ఏర్పడింది. అశోక్ స్థానం భర్తీ అవుతుందా ? అలా గట్స్ ఉన్న పవర్ ఫుల్ లీడర్ ఎవరు ? అవుతారనే చర్చలు కూడా నడుస్తున్నాయి. అశోక్ భార్య విజయలక్ష్మి కామవరపుకోట ఎంపీపీగా ఉన్నారు. ఆమె తమ కేడర్‌కు అండగా ఉంటామని ఇప్పటికే భరోసా ఇచ్చినా ఆమె ఫ్యూచర్‌లో మండల స్థాయికే పరిమితమవుతారా ? లేదా నియోజకవర్గ స్థాయిలో యాక్టివ్‌గా ఉంటారా ? అన్నది ఇప్పట్లో క్లారిటీ లేకపోవచ్చు.
ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం లేదా చింతలపూడిలో ఏదో ఒకటి జనరల్ నియోజకవర్గంగా ఏర్పడితే ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీథర్ రేసులో ఉండవచ్చు. శ్రీథర్ దగ్గరా ఓ చిక్కుముడి ఉంది. ఆయన మొన్న ఎన్నికలకే రాజకీయాల పట్ల ఆనాసక్తితో పోటీ చేయలేదు. మళ్లీ శ్రీథర్ రావొచ్చు.. రాకపోనూ వచ్చు. పైగా ఎంపీగానే ఆయనకు రాజకీయాలకు టైం కేటాయించే తీరికలేదు... ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే పార్ట్ టైం పాలిటిక్స్ కుదరవు. ఇక శ్రీథర్ సోదరి పొన్నాల అనిత అయితే కరెక్టుగా సూటబుల్ అవుతుందనే వారు ఎక్కువ మందే ఉన్నారు. అనితమ్మ కోటగిరి విద్యాధరరావు వారసురాలిగా వచ్చి స్వగ్రామం తూర్పు యడవల్లి సర్పంచ్‌గా రెండుసార్లు వరుస విజయం సాధించారు. ఆమెకు చట్టసభలకు వెళ్లే ఆసక్తి ఉందని సన్నిహితుల అభిప్రాయం. బలమైన రాజకీయ వారసత్వానికి తోడు.. ఆర్థికంగా బలంగా ఉండడం.. మహిళా రిజర్వేషన్లతో మహిళలకు 33 శాతం సీట్ల నేపథ్యంలో ఆమె పేరు కూడా రేసులో బలంగానే ఉంది.
సరితమ్మ మనసులో ఏముందో..?
దివంగత హెట్రో డ్రగ్స్ కీలక ఉద్యోగి కీసర విజయభాస్కర్ రెడ్డి సతీమణి సరితారెడ్డి ( పండమ్మ) కూడా రెడ్డి సామాజిక వర్గం నేపథ్యంలో రేసులో ఉంటారా ? ఆమె మనసులో ఏముందున్నది చూడాలి. భర్త మరణం తర్వాత ఆమె నియోజకవర్గంలో కీలకమైన మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారు. జగన్ బాబాయ్, వైసీపీ ఎంపీ వైవి. సుబ్బారెడ్డితో ఈ కుటుంబానికి డైరెక్ట్ యాక్సస్ ఉంది. ఆర్థిక బలంతో పాటు సామాజిక కోణంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెడ్లకు ఒక సీటు ఇవ్వాలనుకుంటే వీరే బెస్ట్, ఫస్ట్ ఆప్షన్ అవుతారు. ఏదేమైనా అశోక్ లా జనాల్లోకి దూసుకుపోయే లీడర్ వైసీపీలో ఎవరు అవుతారు... ఈ ప్రాంత వైసీపీ రాజకీయాలు ఎవరి కంట్రల్లోకి వెళతాయన్నది చూడాలి.