హైదరాబాద్‌లోని మందుబాబులకు పోలీస్ అధికారులు బ్యాడ్ న్యూస్ వినిపించారు. రెండు రోజుల పాటు వైన్స్, బార్లు మూసేయాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతుండగా ఇప్పటికే నగరంలో వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. వినాయకున్ని ప్రతిష్ఠించిన తర్వాత మూడో రోజు నుంచే నిమజ్జనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పటికే నగరంలోని హుస్సేన్ సాగర్‌తో పాటు పలు చెరువులు, కుంటల వద్ద గణేష్ నిమజ్జనాల సందడి నెలకొంది. అయితే ప్రధానంగా నగరంలోని బడా గణేషుడైన ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం మంగళవారం అనగా సెప్టెంబర్ 17న నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 17వ తేదీకి తొమ్మిది రోజులు అవుతుండటంతో సుమారు అన్ని వినాయకులను అదే రోజున నిమజ్జనం చేయనున్నారు. కొన్ని గణేషులను పదకొండు రోజుల వరకు ఉంచినప్పటికీ చాలా వరకు తొమ్మిదో రోజునే నిమజ్జనం చేస్తుంటారు. దీంతో ఆ రోజున నగరమంతా పండగ వాతావరణం నెలకొననుంది.
ఈ క్రమంలో నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.శోభాయాత్రలు జరిగే మార్గాల్లో నిమజ్జనాలు చేసే ప్రదేశాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా వచ్చిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రంగంలోకి దిగి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనం రోజయిన సెప్టెంబర్ 17వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కళ్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, మూసేయాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.ఈ నిబంధనలను వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు తప్పక పాటించాలని.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. అయితే స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవని పోలీస్ అధికారులు తెలిపారు.