ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చి మరో రెండు రోజుల్లో మూడు నెలలు పూర్తవుతాయి. కూటమి పాలనలోకి వచ్చాక ప్రజలు చాలా ఆశించారు. అయితే ఏపీలో ప్రస్తుతం ఏం జరిగిన ప్రభుత్వ పెద్దల వేళ్లు వైసీపీ అధినేత జగన్ వైపే చూపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు రాష్ట్రం అధోగతి పాలవుతుందని టీడీపీ, జనసేన విమర్శించాయి. తీరా అధికారంలోకి వచ్చాక కూడా అవే తరహా విమర్శలు చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తవుతాయి. ఇప్పటికీ ప్రభుత్వానికి ఏదైనా సమస్య ఎదురైతే దానికి కారణం జగన్ అని విమర్శించడం చూసి ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇటీవలే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం జరిగింది. అక్కడ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలానికి వెళ్లిన చంద్రబాబు దానికి కారణం జగన్ అని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఫ్యాక్టరీలలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించలేదని, అందువల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఫ్యాక్టరీల యజమానుల నుంచి ముడుపులు తీసుకుని సేఫ్టీ ఆడిట్ పక్కన పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో ఏం జరిగినా దానికి గత ప్రభుత్వమే కారణమని టీడీపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
ప్రస్తుతం బెజవాడను వరదలు ముంచెత్తాయి. అక్కడ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిగ వంటి ప్రాంతాలన్నీ నీటమునిగాయి. బుడమేరు పొంగడంతో విజయవాడ వాసులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే దీనికి కూడా జగన్ కారణమని కూటమి ప్రభుత్వం విమర్శిస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలతో ఢీకొట్టి, బ్యారేజీని నాశనం చేసేందుకు వైసీపీ యత్నించిందని మంత్రులు సైతం విమర్శిస్తున్నారు. ఇక ఏపీకి అప్పు పుట్టకపోవడానికి జగన్ కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి ప్రభుత్వ ఖజానాలో కేవలం రూ.150 కోట్లు మాత్రమే ఉన్నాయని యనయల రామకృష్ణుడు పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని నడపడం కష్టమేనని అన్నారు. అయితే ఇటీవలే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల అప్పు పుట్టింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని ప్రకటించింది. మరి ఈ అప్పు ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులపాలైందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. అయితే ఏపీ విభజన నాటికే మనకు రూ.90 వేల కోట్ల అప్పు ఉంది. చంద్రబాబు 2014లో సీఎం అయ్యాక రూ.2.5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ లెక్కన చూస్తే జగన్ చేసింది 6 లక్షల కోట్లు మాత్రమే. ఏపీ అప్పులో చంద్రబాబుకు కూడా పాత్ర ఉంది. అయితే జగన్‌పై మాత్రమే విమర్శలు చేసి తప్పించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలని అంతా పేర్కొంటున్నారు.