రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిన కొండా సురేఖ.. భర్త కూడా..?
* తెలంగాణ రాజకీయాల్లో వర్గ పోరు
* సీఎంకి పక్కలో బల్లెంలా తయారైన కొండా సురేఖ
* భర్త ఆమె ఇద్దరూ కూడా పెత్తనం కోసం ఆరాటం
( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
ఆధిపత్య పోరు అనేది ముఖ్యమంత్రులకు పెద్ద తలనొప్పిగా మారుతుందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పెత్తనం కోసం నేతలు ఒకరికొకరు పోట్లాడుకోవడం సాధారణంగా కనిపించే విషయమే. అయితే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ పక్కలో బల్లెం లాగా తయారయ్యారు. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అయిన సురేఖ వరంగల్ టౌన్‌పై పెత్తనం తనకే కావాలంటూ చాలా హడావుడి చేస్తున్నారు. అంతేకాదు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కూడా తగువులు పెట్టుకుంటున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. సీతక్కతో ఆమె కాంగ్రెస్‌లో వరంగల్ మేయర్ చేరికపైనా అభ్యంతరం తెలిపారు.
"మా మధ్య ఆప్యాయత, అనురాగాలు ఉన్నాయ"ని వీళ్ళిద్దరూ చెప్పుకుంటున్నా అంతర్గతంగా ఒకరికొకరు పెత్తనం కోసం చాలా పోరాటం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొండా సురేఖ వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె గతంలో తెలంగాణ శాసనసభకు శ్యాంపేట, పరకాల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కూడా అక్కడ తనమాటే నెగ్గాలని పెద్దపెద్ద విభేదాలకు దారి తీస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడలేకపోతున్నారు. ఎవరినీ మందలించినా పార్టీకే నష్టం కాబట్టి సైలెంట్ గా ఉండాల్సి వస్తోంది.
కొండా సురేఖ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సొంత పనికి ఇద్దరు సీఐలు ఎస్కార్ట్‌గా తీసుకెళ్లారని ఇటీవల పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. ఇక కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య కూడా లొల్లి నడుస్తోంది. వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో సురేఖ భర్త కొండా మురళి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య కూడా వర్గపోరు సాగుతోంది. వీరిద్దరూ బహిరంగంగానే సవాళ్లు విసురుకుంటున్నారు. మరి కొండా సురేఖ తన పంతం నెగ్గించుకోవడానికి ఇంకా ఎన్ని షాకులు ఇస్తారో చూడాలి. సీతక్క కూడా తగ్గేదేలే అని రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడు మంచి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.