ఒక్క ఎన్టీఆర్‌... విప్ల‌వాత్మ‌క సంచ‌ల‌నాలు... లిస్ట్ ఇదే..!

RAMAKRISHNA S.S.
- గ్రామాధికారులు... శాస‌న‌మండ‌లి ర‌ద్దు
- ఉన్న‌తాధికారుల అవినీతి టార్గెట్‌గా ధ‌ర్మ మ‌హామాత్య ప‌ద‌వి ఏర్పాటు
- సంపూర్ణ మ‌ద్య‌నిషేధం అమ‌లు

( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. ఎన్నో సంచల నిర్ణయాలకు కేంద్ర బిందువు అయ్యారు. 1983 జనవరి 9న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరు నమోదు చేసుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే.. ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్ ల అవినీతి నిర్మూలించడానికి ప్రయత్నించారు. దీనికోసం ధర్మ మహామాత్య అనే పదవిని ఏర్పాటు చేశారు. తనకు సన్నిహితుడైన రామిరెడ్డిని ధర్మ మహామాత్య‌గా నియమించారు. రామిరెడ్డి హఠాత్తుగా ఉన్నతాధికారుల కార్యాలయాలు ఇళ్లపై దాడులు చేసేవారు. దీంతో ప్రారంభంలోనే ఎన్టీఆర్ అధికారుల మద్దతు కోల్పోయారు.


ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా కార్యాలయంలోనే ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 55 ఏళ్లకు తగ్గించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు రెండు నెలల పాటు సమ్మె చేసినా ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అలాగే ఎన్టీఆర్ 1984 జనవరిలో గ్రామ అధికారుల పదవులను రద్దు చేశారు. అర్చకుల వారసత్వానికి కూడా రద్దు చేశారు. తన మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి అయిన రామచంద్రరావు అవినీతికి పాల్పడుతున్నారని ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇక శాసనమండలి కారణంగా పరిపాలన నిర్ణయాలలో స్త‌బ్ద‌త ఏర్పడుతుందని భావించిన ఎన్టీఆర్.. శాసనమండలిని రద్దు చేయడానికి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు.


ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే.. శాసనమండలి రద్దు అయ్యింది. అలాగే 1985 సెప్టెంబర్ లో తండ్రి ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం తీసుకువచ్చారు. 1985 డిసెంబర్లో స్థానికేతరులను వారి వారి ప్రాంతాలకు పంపటానికి.. 610 జీవో తీసుకువచ్చినా ఇది సరిగా అమలు కాలేదు. అలాగే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూనే.. విశ్వామిత్ర అనే సినిమాలో నటించడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక 1994 డిసెంబర్ 12న ఎన్టీఆర్ నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేరోజు ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారు. ఇలా ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: