మంత్రి పదవి మిస్ అయినా ప్రభుత్వంలో జీవీకి ఆ కీలక పదవి ఫిక్స్.. ?
- పదేళ్ల కు పైగా ఉమ్మడి గుంటూరు జిల్లా.. పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సేవలు
- చీఫ్ విప్ పదవితో సరైన గుర్తింపు
- ( పల్నాడు - ఇండియా హెరాల్డ్ ) .
జి వి ఎస్ ఆంజనేయులు పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నుంచి 2009 - 2014 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచారు జీవి ఆంజనేయులు. 2019లో బొల్లా బ్రహ్మనాయుడు చేతిలో ఓడిపోయిన ఆంజనేయులు తిరిగి 2024 ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పదవిలో కొనసాగారు. జిల్లాల పునర్విభజన జరిగి ఆంజనేయులు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఎన్నికలలో వైసీపీ బలంగా ఉన్న పలనాడులో నరసరావుపేట పార్లమెంటు సీటుతో పాటు మొత్తం 7 అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో ఘనవిజయం సాధించడంలో ఆంజనేయులు కీలకపాత్ర పోషించారు.
పార్టీ అధికారంలోకి వచ్చాక పలనాడు జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలను ఆంజనేయులు వియ్యంకులు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బాబుకు కట్టబెట్టారు. వాస్తవంగా చూస్తే కమ్మ సామాజిక వర్గ కోటాలో సీనియర్ నేతగా ఉన్న ఆంజనేయులుకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు మంత్రి పదవి రాకపోవడంతో ఆయనకు కీలకమైన క్యాబినెట్ హోదా ఉన్న చీఫ్ విప్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకటి రెండు రోజుల్లోనే ఆంజనేయులుకు చీఫ్ విప్ పదవి కేటాయించే అంశంపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆంజనేయులుకు ఆ ఆశ నెరవేరుకపోయిన చీఫ్ విప్ పదవి దక్కుతోంది.