ఏపీ: కొత్త రేషన్ కార్డులపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

FARMANULLA SHAIK
ఏపీలో చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన చాలా మందికి రేషన్ కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేృతృత్వంలోని ప్రభుత్వం… కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టిపెట్టింది. సాధ్యమైనంత త్వరగా ఈ కార్డులను అందజేయాలని భావిస్తోంది.రాష్ట్రంలో అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇక కొత్తగా పెళ్లయిన జంటలకు.. మ్యారేజ్ సర్టిఫికేట్‌ ఆధారంగా రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గతంలో అధికారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు జారీ చేసిన రేషన్‌ కార్డులపై జగన్ ఫోటోను ముద్రించి, వైసీపీ రంగులు కలిపి ఇచ్చింది. అయితే జగన్ బొమ్మ, వైసీపీ రంగులను తొలగించి.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్లను అధికారులు పరిశీలిస్తున్నారు.ఏపీలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌ కార్డులు ఉండగా.. ఇందులో 89 లక్షల రేషన్‌ కార్డులకు ఆహారభద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తూ ఉంది. మిగిలిన కార్డులకు రేషన్‌ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్రం డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం అంగీకరించడం లేదు.గతంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం 5 రోజుల్లోనే అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ, గత ఐదేళ్లలో కొత్త కార్డులకు కోత పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 2019 జూన్‌ నాటికి రాష్ట్రంలో 1,47,33,044 రేషన్‌ కార్డులు ఉండగా.. 2024 ఆగస్టుకి 1,48,43,671 ఉన్నాయి. గత ఐదేళ్లలో పెరిగిన కార్డులు 1.10 లక్షలుగా ఉంది. పెళ్లైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే.. అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్‌ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. ఇది వైసీపీ ప్రభుత్వం హాయాంలో జరగలేదు. ఫలితంగా కొత్తగా పెళ్లైన వారికి కార్డులు ఇవ్వలేదు. దీంతో మ్యారేజీ సర్టిఫికేట్ చూపిస్తే కొత్త జంటకు రేషన్‌ కార్డు ఇస్తామని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: