వైసీపీ మాజీ మంత్రి కారుమూరి బైబై పాలిటిక్స్ ..!
- ఈ ఎన్నికల్లో తండ్రి, కొడుకులిద్దరు ఓటమి
- ఆరోగ్య కారణాలతో పాలిటిక్స్‌కు ఇక దూరమే..?
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
కారుమూరి నాగేశ్వరరావు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధారణ జడ్పిటిసిగా కెరీర్ ప్రారంభించిన కారుమూరి ఆ తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ అయ్యారు. అక్కడి నుంచి కారుమూరి రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూ మంత్రి వరకు వచ్చింది. కారుమూరి క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తున్నారా ? అంటే అవుననే చెప్పాలి. 2006లో ద్వారకా తిరుమల జడ్పిటిసి గా గెలిచిన కారుమూరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ అయ్యారు. జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడే 2009లో తణుకు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కారుమూరి 2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చి దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
అనంతరం 2019 ఎన్నికలలో తణుకు నుంచి మరోసారి వైసీపీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలలో కారుమూరి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఎన్నికలలో కారుమూరితో పాటు కారుమూరు తనయుడు సునీల్ కుమార్ యాదవ్ కూడా రంగ ప్రవేశం చేశారు. కారుమూరి తణుకు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. కారుమూరి తనయుడు సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు నుంచి పార్లమెంటుకి పోటీ చేశారు. ఈ ఎన్నికలలో తండ్రి కొడుకులు ఇద్దరు ఓడిపోయారు. ఈ క్రమంలోనే కారుమూరి మంత్రి హోదాలో ఉండి ఓడిపోవడంతో పాటు ఆరోగ్య కారణాల రీత్యా ఇక క్రియాశీలక రాజకీయాలలో కొనసాగే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది.
దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజకీయాలలో కొనసాగుతూ వస్తున్న కారుమూరి ఎన్నికలలో ఓటమితో ఇక రాజకీయాలలో కొనసాగే ఆలోచనలో లేరట. తన భవిష్యత్తు రాజకీయ వారసుడిగా తన కుమారుడు సునీల్ కుమార్ యాదవ్‌ను కొనసాగిస్తారని తెలుస్తోంది. ఇక సునీల్ కుమార్ యాదవ్ ఎన్నికలలో ఏలూరు ఎంపీగా ఓడిపోయారు.. వచ్చే ఎన్నికలలో ఆయన కారుమూరి వారసుడుగా ఎన్నికలలో పోటీ చేయనున్నారు.