జగన్ తప్పుల వల్లే వాలంటీర్లకు జీతాల సమస్య .. మంత్రి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేతనాలు అందకపోవడం వల్ల వాలంటీర్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వాలంటీర్లను కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తుండటంతో వాలంటీర్లు తెగ టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అయితే వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.
 
2023 సంవత్సరం ఆగష్టు నుంచి గత ప్రభుత్వం వాలంటీర్లను ఎందుకు రెన్యూవల్ చేయలేదని మంత్రి ప్రశ్నించారు. వాలంటీర్లను తాము తొలగించలేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ చేసిన పాపం వల్లే వాలంటీర్లకు జీతాలు రావడం లేదని డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఈ మంత్రి ప్రస్తుతం రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు.
 
రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నీచ రాజకీయానికి పాల్పడుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగించారని ఇందుకు సంబంధించి వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రభుత్వానికి జరిగిన ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరును మార్చి జగన్ తన పేరు పెట్టుకుని అంబేద్కర్ ను అవమానించారని మంత్రి వెల్లడించారు.
 
అంబేద్కర్ పేరును తొలగించిన సమయంలో వైసీపీ దళిత నేతలు ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదని ఆయన తెలిపారు. ఎన్టీయే కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. జగన్ పేరుతో ఉన్న బ్యాగులను సైతం ఎన్డీఏ సర్కార్ విద్యార్థులకు పంపిణీ చేసిందని ఆయన తెలిపారు. మంత్రి డోలా వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: