మిస్ యు జగన్.. వాటిని గుర్తు చేసుకుంటున్న జనాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలపైనే దాటింది. కొత్త ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు ఏడు శ్వేతపత్రాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అనేది ఏమాత్రం బాలేదని, గత ప్రభుత్వం అప్పుల కుప్పలు మిగిల్చి వెళ్లిపోయిందని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం తమ నేతలపై జరుగుతున్న దాడులను ప్రజలకు గుచ్చి గుచ్చి చెబుతూ వస్తోంది. ఎన్నికల తర్వాత ప్రజల ముందుకు అడపాదడపా వచ్చిన జగన్ ఇప్పుడు జనంలోకి వచ్చి మీడియా ప్రశ్నలకు జవాబులిస్తున్నారు.
ఓ వైపు తమ పార్టీ నేతలతో సమావేశాల్లో పాల్గొంటూనే ప్రజలకు చేరువయ్యేందుకు జగన్ చూస్తున్నారు. ఇప్పటికైతే మాజీ సీఎం జగన్‌ను దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా మిస్ అవుతున్నారట. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల వల్ల ఓ మిడిల్ క్లాస్ కుటుంబం ఏడాదికి లక్ష వరకూ నగదును పొందేది. ఆటో డ్రైవర్లకు వాహన మిత్రం, పిల్లలకు అమ్మఒడి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు భరోసా వంటి పథకాల వల్ల కుటుంబంలోని అందరూ లబ్ధి పొందేవారు. ఇలా ఏడాదిలో లక్ష రూపాయల వరకూ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి. కొత్త సర్కార్ వచ్చాక ఏ పథకం ద్వారా కూడా నగదు పడలేదని జనాలు బోరుమంటున్నారు. జగన్ కంటే రెట్టింపు పథకాలు తీసుకొస్తామన్న బాబు రెండు నెలలు అవుతున్నా ఇంకా ఏదీ అమలు చేయలేదు.
అధికారంలోకి వచ్చాక టిడిపి పథకాల జోరును కొనసాగిస్తుందని అనుకుంటే..ఏడాది వరకూ ఆశలేవీ పెట్టుకోవద్దని బాబు మొహమాటం లేకుండా చెప్పేసి షాక్ ఇచ్చారు. దీంతో కొందరికి బాబు ప్రభుత్వ పనితీరు అస్సలు నచ్చడం లేదని తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ చేసిన అప్పుల వల్ల తామేమీ చేయలేకపోతున్నామని టీడీపీ పెద్దలు చెప్పకనే చెప్పేశారు. అవన్నీ జనాలకు మింగుడుపడటం లేదు. ఇప్పుడు జనాలకు కావాల్సింది పథకాలు. జగన్ ఏం చేసినా సమయానికి జనాల అకౌంట్లలో డబ్బులు వేస్తూ సక్సెస్ అయ్యారు. ఆ పని బాబు ప్రభుత్వం చేయడం లేదని దిగువ తరగతి ప్రజలు బావురుమంటున్నారు.