కేసీఆర్ ప్రారంభించారు.. పాలమూరు ప్రాజెక్టును రేవంత్ అయినా పూర్తి చేస్తారా?

praveen

  * ప్రాజెక్టు పూర్తయితే 12.30 లక్షల ఎకరాలకు నీళ్లు
* పనులు పూర్తి కాకుండానే ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
* రేవంత్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆశలు పెట్టుకున్న రైతులు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక ఎన్నో కొత్త నీటి ప్రాజెక్టులను ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీళ్లు అందించి  రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడబోతున్నాం అంటూ ప్రకటనలు కూడా చేసింది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన కొన్ని నీటి ప్రాజెక్టులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి అన్నది తెలుస్తుంది. దీంతో ఇక తమ కష్టాలు తీరిపోతాయని తమ పంట పొలాలు సశుశ్యామలంగా మారిపోతాయని ఆశలు పెట్టుకున్న రైతన్నలందరికీ కూడా కొన్ని ప్రాజెక్టుల విషయంలో నిరాశ మిగిలింది.

 అలాంటి ప్రాజెక్టులలో రంగారెడ్డి - పాలమూరు ప్రాజెక్టు కూడా ఒకటి అని చెప్పాలి. 35200 కోట్లతో 2015 లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీవో విడుదల అయింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 12.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశం. శ్రీశైలం నుంచి నార్లాపూర్ కి, నార్లాపూర్ నుంచి ఏదులకు, ఏదుల నుంచి వట్టెంకు, వట్టెం నుండి కార్వేనాకు,  కర్వేన నుంచి ఉద్దండపూర్ కు, ఉద్దండపూర్ నుంచి లక్ష్మీదేవి పల్లకి నీళ్లు ఎత్తిపోయాలి. అంటే శ్రీశైలం నుంచి 430 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టులో ఏకంగా 31 పంపులు ఉంటాయి. 28 పంపులు 145 మెగావాట్లు, మూడు పంపులు 65 మెగావాట్ల సామర్థ్యత కలిగినవి.

 అయితే ఇంతటి భారీ ప్రాజెక్టుపై రైతులందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే.. పూర్తికాకుండానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. 31 పంపులకు గాను కేవలం ఒకే ఒక్క  పంపును మాత్రమే మొదలుపెట్టి.. చివరికి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దీంతో రైతుల ఆశలన్నీ కూడా అడియాశలుగానే మిగిలిపోయాయి. ఇక అంతలోనే రాష్ట్రంలో ఎన్నికలు రావడం అధికారం చేతులు మారడం జరిగింది. దీంతో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా సందిగ్ధత నెలకొంది. అయితే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి.. అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని రైతులందరూ కోరుతున్నారు. ఏకంగా 31 పంపులను మొదలు పెడితే తమకు ఎంతో మంచి జరుగుతుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: