వైసీపీ ఓటమికి పార్టీలోని కీలక నేతలే వెన్నుపోటు పొడిచారా.. లిస్ట్‌లో భారీగా నేతలు?

Suma Kallamadi
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ ఘోర పరాజయానికి గల కారణాలను ఒక్కక్కటిగా విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కదిరి నియోజకవర్గానికి చెందిన పార్టీ మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం ఆ పార్టీ నుంచి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వైసీపీ కీలక నేత మీడియాతో ఆఫ్ ది రికార్డ్‌గా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. త్వరలో సస్పెండ్ అయ్యే నేతల జాబితాలో పెద్ద స్థాయి నేతలు ఉన్నారని, అంతేకాకుండా ఈ లిస్టు భారీగా ఉందని పేర్కొన్నారు. పార్టీ ఓటమికి సొంత నేతలే వెన్నుపోటు పొడిచినట్లు జగన్ భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి అభ్యర్థుల ఎంపికలో జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ నిరాకరించారు. స్థానిక నేతలతో సమన్వయం, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత, ప్రజల్లో తిరగకపోవడం వంటి కారణాలతో టికెట్ విషయంలో వారికి మొండి చేయి చూపారు. అయితే వీరిలో ఐదారుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల్లోకి వెళ్లి టికెట్లు తెచ్చుకున్నారు. అక్కడా విజయం సాధించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఓ వైపు పార్టీ టికెట్ దక్కక, ఇతర పార్టీల్లోకి వెళ్లక కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో రగిలిపోయారు. దీంతో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులతో కుమ్మక్కై, వైసీపీ ఓటమికి వారు గుంతలు తవ్వారని జగన్ ఆలస్యంగా గ్రహించారు. టికెట్ దక్కకపోవడంతో వారంతట వారే పార్టీకి దూరం అవుతారని జగన్ ఇప్పటి వరకు భావించారు.

అయితే పార్టీలో అసంతృప్తిగా ఉంటూనే, కీలక సమయంలో పార్టీ ఓటమికి వారు కారణం అవుతారని జగన్ ఊహించలేదు. తీరా ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైంది. 151 ఎమ్మెల్యే స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు వైసీపీ పరిమితం అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీకి ఓటేశారని నలుగురు ఎమ్మెల్యేలను జగన్ సస్పెండ్ చేశారు. తర్వాత కొందరు ఎమ్మెల్సీలు ప్రతిపక్ష పార్టీల్లో చేరారని వారిపైనా చర్యలు తీసుకున్నారు. తర్వాత సైలెంట్‌గా ఉన్న జగన్ ప్రస్తుతం పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో సీనియర్ నేతలు పార్టీ ఓటమికి కారణమయ్యారని తెలుసుకుని, వారి లిస్ట్ రెడీ చేశారు. మరికొద్ది రోజుల్లో 10 నుంచి 12 మంది కీలక నాయకులను పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన సమీక్షలో జగన్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: