ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న కెరీర్ రికార్డులు ఇవే?

Suma Kallamadi
ఏపీ 16వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు తాజాగా ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగగా ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి అయ్యన్న పాత్రుడు పేరును ఒక్కసారిగా ప్రకటించడం జరిగింది. ఆ తరువాత సభ్యులు ఒకరి తరువాత ఒకరు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. దాంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ లు అయ్యన్న పాత్రుడిని గౌరవ ప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది.
కాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయ్యన్నకు దాదాపు 4 దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన రాజకీయ రంగప్రవేశం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకూ 10సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయగా 7 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలుపొందారు. మొత్తంగా ఆయన ఇప్పటి వరకూ 5 ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రిగా సాంకేతిక విద్య, క్రీడా, రహదారులు భవనాలు, అటవీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.
ఇక రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి... జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావులు ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. శుక్రవారం వీరు ప్రమాణ స్వీకారంకు హాజరుకాలేక పోవడంతో ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో రెండోరోజు సమావేశాలు ప్రారంభైన వెంటనే వారితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. ఇకపోతే అయ్యన్న పాత్రుడుని స్పీకర్ గా ఎన్నికచేసే ఈ మొత్తం ప్రక్రియలో వైసీపీ ఎక్కడా కలుగజేసుకున్న దాఖలాలు కనబడలేదు. ఎందుకంటే రెండోరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: