నారాయణ : రాజధాని నిర్మాణం కోసం మాస్టర్‌ ప్లాన్‌?

Veldandi Saikiran

అమరావతి రాజధానిని పూర్తి చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారాయణ....మేళతాళలతో తన ఛాంబర్లోకి వచ్చారు. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్లో విధులు నిర్వహించారో.. అదే ఛాంబర్లో బాధ్యతల స్వీకరణ చేశారు. అటు మంత్రి నారాయణకు స్వాగతం పలికారు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీ లక్ష్మి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..మున్సిపల్ శాఖలో ముఖ్యమైంది అమరావతి అని.... రెండున్నరేళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలు, పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు.

 
సెక్రటేరియట్,అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తామని... 3600 కి.మీ రోడ్లతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం.. ఎలాంటి మార్పు లేదని వివరించారు. 217 చ.గజాల్లో గతంలో 48 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని.... ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని గుర్తు చేశారు మంత్రి నారాయణ. రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగుతుందని వివరించారు నారాయణ.

 
గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటలు ఆడిందని ఆగ్రహించారు. రైతుల కౌలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారన్నారు. గతంలో నాకున్నఅనుభవంతో ప్రపంచంలో టాప్ 5 లో ఒకటిగా ముందుకు తీసుకెళతాను....గతంలో మా ప్రభుత్వంలో 48 వేల  కోట్లతో  అమరావతి కోసం టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టామని వివరించారు. ఏ ఒక్క చిన్న లిటిగేషన్ లేకున్నా.. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేసిందని ఆగ్రహించారు. భూములిచ్చిన రాజధాని రైతులను గత ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని.. వైసీపీ అరాచక పాలనతో విసుగు చెంది ప్రజలు... ఎన్డీఎకు అధికారం ఇచ్చారన్నారు.

 
త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని... పదిహేను రోజుల్లో అధ్యయనం చేసి  టైం బౌండ్ నిర్ణయిస్తామని వెల్లడించారు. రాజధాని పనులు ఎప్పటిలోగా  పూర్తి చేస్తామో చెబుతామని... మూడు దశల్లో రాజధాని అమరావతిని నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రూపొందించి అమలు చేశామని పేర్కొన్నారు. రాజధానిలో తొలి ఫేజ్ పనులకు 48 వేల కోట్లు ఖర్చవుతుందని... మూడుఫేజుల్లో కలిపి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. రాజధాని పై కోర్టుల్లో ఉన్న  కేసులపై స్టడీ చేసి సానుకూలంగా తగిన  చర్యలు తీసుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: