ఏపీ: కూటమినుండి మంత్రులుగా ఎవరి ఛాన్సు దక్కెనో?

Suma Kallamadi
ఆంధ్రాలో ఎన్నికల అంకం ముగిసింది. కూటమి వైసీపీ గోడలు బద్దలు చేసుకొని మరీ దూసుకుంటూ అధికారంలోకి వచ్చింది. అతి త్వరలోనే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక చంద్రబాబు కొత్త కేబినెట్‌లో టీడీపీతో పాటూ జనసేన, బీజేపీలు చేరడం అనేది అనివార్యం. ఈ క్రమంలోనే కూటమినుండి మంత్రులుగా ఎవరి ఛాన్సు దక్కెనో అన్న అంశంపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్నది కేవలం టీడీపీ అభ్యర్థులు మాత్రమే కాదు... జనసేన మరియు బీజేపీ అభ్యర్థులు కూడా ఉన్నారు.
ఈసారి బాబు సీనియర్లతో పాటుగా మహిళలు, యువతకు కూడా ప్రాధాన్యం వహించాలని చూస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ క్రమంలో కొన్ని పేర్లు ఇపుడు పలు మీడియాలలో బాగా వినబడుతున్నాయి. ముందు జిల్లాలవారీగా చూసుకుంటే... ఉత్తరాంధ్ర విషయానికొస్తే, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాని మొదట పరిశీలిస్తే... అచ్చెన్నాయుడు (టెక్కలి), కొండ్రు మురళి (రాజాం), బెందాళం అశోక్ (ఇచ్చాపురం) పేర్లు ప్రధమంగా వినబడుతున్నాయి. అదేవిధంగా విజయనగరం జిల్లా విషయానికొస్తే కిమిడి కళా వెంకట్రావు (చీపురుపల్లి), గుమ్మడి సంధ్యారాణి (సాలూరు), బేబీ నాయన (బొబ్బిలి)ల పేర్లు బాగా వినబడుతున్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాలో గంటా శ్రీనివాసరావు (భీమిలి), బండారు సత్యనారాయణమూర్తి (మాడుగల), వెలగపూడి రామకృష్ణబాబు (విశాఖపట్నం తూర్పు), పల్లా శ్రీనివాసరావు (గాజువాక), అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం), వంగలపూడి అనిత (పాయకరావుపేట)ల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా భోగట్టా.
ఇపుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను పరిశీలిస్తే... నిమ్మకాయల చినరాజప్ప (పెద్దాపురం), యనమల రామకృష్ణుడు (ఎమ్మెల్సీ), బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి రూరల్)‌, జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట) పేర్లు మనకు బాగా వినబడుతున్నాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాని పరిశీలిస్తే... పితాని సత్యనారాయణ (ఆచంట), రఘురామకృష్ణరాజు (ఉండి), నిమ్మల రామానాయుడు (పాలకొల్లు) పేర్లు బలంగా వినబడుతున్న పరిస్థితి ఉంది.
కృష్ణా జిల్లా విషయానికొస్తే... గద్దె రామ్మోహన్ (విజయవాడ తూర్పు), పార్థసారథి (నూజివీడు), కొల్లు రవీంద్ర (మచిలీపట్నం), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట), బోండా ఉమ (విజయవాడ సెంట్రల్)లు రేసులో ఉన్నట్టు కనబడుతోంది. అదేవిధంగా గుంటూరు జిల్లాని పరిశీలిస్తే గనుక నక్కా ఆనందబాబు (వేమూరు), కన్నా లక్ష్మీనారాయణ (సత్తెనపల్లి), తెనాలి శ్రావణ్‌కుమార్‌ (తాడికొండ)ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేష్ మంత్రివర్గంలో చేరడంపై అయితే ఇంకా క్లారిటీ రావలసి ఉంది. ఎందుకంటే... గతంలో తాను పదవిని తీసుకోనని చెప్పడం కొసమెరుపు.
అదేవిధంగా ప్రకాశం జిల్లాని పరిశీలిస్తే... డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (కొండేపి), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), ఏలూరు సాంబశివరావు (పర్చూరు) పేర్లు మొదటగా వినబడుతున్నాయి. ఇక నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), పొంగూరు నారాయణ (నెల్లూరు సిటీ), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (సర్వేపల్లి) రేసులో ఉన్నట్టు కనబడుతోంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాని తీసుకుంటే... అమరనాథ్‌రెడ్డి (పలమనేరు)తోపాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
అదేవిధంగా అనంతపురం జిల్లాని ఒకసారి పరిశీలిస్తే... కాలువ శ్రీనివాసులు (రాయదుర్గం), పయ్యావుల కేశవ్ (ఉరవకొండ), పరిటాల సునీత (రాప్తాడు), బీసీ జనార్దన్‌రెడ్డి (బనగానపల్లె), కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (డోన్)ల పేర్లు బాగా వినబడుతున్నాయి. కడప జిల్లా నుంచి పుట్టా సుధాకర్‌ యాదవ్ (మైదుకూరు), భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి (ఎమ్మెల్సీ), మాధవీరెడ్డి (కడప) పేర్లు చర్చల్లో ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా మైనారిటీల విషయానికొస్తే... నసీర్‌ (గుంటూరు తూర్పు), ఎన్‌ఎండీ ఫరూక్‌ (నంద్యాల), షాజహాన్‌ బాషా (మదనపల్లి)లు గెలవగా.. వీరిలో ఒకరికి కేబినెట్ బెర్త్ అయితే ఇవ్వడం తప్పనిసరి అంటున్నారు. ఇక గెలిచింది కూటమి ప్రభుత్వం కాబట్టి.. జనసేన పార్టీ, బీజేపీ నుంచి కూడా మంత్రివర్గంలోకి కొంతమందిని తీసుకోవలసిన ఆవశ్యకత ఉంది. అయితే ఇపుడు ఇంతమందిలో బాబు ఎవరికి పట్టం కట్టబోతున్నాడు అన్నదే పెద్ద ప్రశ్న!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: