కౌం ' ట్రిక్స్ ' : కౌంటింగ్ ఏజెంట్లు ఇది చ‌దువుకోండి... మీకు కౌంటింగ్‌లో ఫుల్ కాన్ఫిడెన్స్‌..!

RAMAKRISHNA S.S.
- కంట్రోల్ యూనిట్‌పై ఏజెంట్ల‌ డేగ‌క‌న్ను ఉండాల్సిందే
- దుగ్గిరాల బూత్‌లో జ‌రిగిన మ్యాజిక్ వ‌ల్లే మంగ‌ళ‌గిరిలో 12 ఓట్ల‌తో తారుమారైన ఫ‌లితం
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
ఎన్నిక‌ల కౌంటింగ్ వేళ‌.. ఆయా పార్టీల అభ్య‌ర్థుల త‌ర‌ఫున కౌంటింగ్ కేంద్రాల‌కువెళ్లే ఏజెంట్ల‌దే ప్ర‌ధాన బాధ్య‌త‌. ఉదాహ‌ర‌ణ‌కు.. 2014లో మంగ‌ళ‌గిరిలో ఓ ఘ‌ట‌న జ‌రిగింది. అక్క‌డ టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన గంజి చిరంజీవి గెలిచిన‌ట్టు ప్ర‌క‌టించారు. కానీ.. దీనిపై అనుమానం వ‌చ్చిన వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్నారెడ్డి దుగ్గిరాల బూత్‌లో న‌మోదైన ఓట్ల‌ను మ‌రోసారి లెక్కించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో 12 ఓట్ల తేడా వ‌చ్చి.. ఆళ్ల రామ‌కృష్నారెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇలా.. తేడా రావ‌డానికి ఏజెంట్ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని త‌ర్వాత తేల్చారు. ఇలా.. అప్పుడ‌ప్పుడు.. పొర‌పాట్లు జ‌రుగుతుంటాయి. అందుకే.. ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న‌ప్పుడు రీ కౌంటింగ్ చేస్తారు.

+ 2014లో చీరాల‌లోనూ ఇలానే జ‌రిగింది. అక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా పోతుల సునీత పోటీ చేయ‌గా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ బ‌రిలో ఉన్నారు. పోలింగ్ స‌మ‌యంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు... ఏకంగా లెక్కింపు రోజు వ‌ర‌కు సాగాయి. చీరాల‌లో త‌మ‌కు త‌క్కువ ఓట్లు రావ‌డంతో సునీత తాలూకు ఏజెంట్ గ‌ట్టిగానే ప్ర‌శ్నించారు. దీంతో తిరిగి లెక్కించారు. సో.. ఎలా చూసుకున్నా ఏజెంట్ అనే వ్య‌క్తి చాలా కీల‌కం.

ఏజెంట్లు ఏం చేయాలి?
కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రాలకు ఉదయం 6 గంటల్లోపు వెళ్లాలి. ఫాం 18పై రిటర్నింగ్ అధికారితో సంతకం చేయించి తీసుకోవాలి.
అనంతరం ఇచ్చే ఐడీ, ఆధార్, ఫాం 17C, బుక్ లెట్, పెన్ తీసుకెళ్లాలి. కౌంటింగ్ కేంద్రాలకు మొబైల్స్ అనుమతించరు. ఒకసారి లోపలికి వెళ్లాక మళ్లీ ప్రక్రియ పూర్తయ్యే వరకూ బయటకు వచ్చేందుకు అనుమతించరు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల ఫలితాలకు సంబంధించి వేర్వేరుగా కౌంటింగ్ హాల్స్ ఉంటాయి.  కేటాయించిన టేబుల్ నెంబర్ వద్ద మాత్ర‌మే ఏజెంట్ కూర్చోవాలి. ఏ పోలింగ్ బూత్‌ల నుంచి కంట్రోల్ యూనిట్స్ ఏ టేబుల్‌కు వెళ్లాలనేది ముందుగానే నిర్ణయిస్తారు.

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత, ఈవీఎంల కౌంటింగ్ ఉంటుంది. ఏజెంట్లు కంట్రోల్ యూనిట్ల యంత్రాల సీల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకుంటే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. ఫలితాలు మీరు మళ్లీ చూడాలని అనుకుంటే రిటర్నింగ్ అధికారిని అడిగితే మెషీన్ లో బటన్ నొక్కి చూపిస్తారు. అంతా సవ్యంగా పూర్తైతే కౌంటింగ్ సూపర్వైజర్ ఇచ్చిన 17C ఫాం పార్ట్ 2పై సంతకం చేయాలి. అందరికీ సమ్మతమైతే ఆ ఫాంను ఆర్వోకు అందించి ఫలితాలు వెల్లడిస్తారు.

'ఫాం 17C' ఇంకో అధికారికి అందిస్తారు. ఆ వివరాలు 'ఫాం 20'లో భద్రపరుస్తారు. నియోజకవర్గంలో అన్ని కంట్రోల్ యూనిట్స్ పూర్తైన తర్వాత వీపీ ప్యాట్ మెషీన్స్‌లో పేపర్ స్లిప్స్ కౌంట్ చేస్తారు. ఈ నెంబరు దానికి సంబంధించి కంట్రోల్ యూనిట్‌లో నెంబర్ సరిపోలుస్తారు. ఇలా.. ఒక్క బూత్‌కే లెక్కిస్తారు. అన్నీ కుద‌ర‌వు. ఇటీవ‌లే సుప్రీంకోర్టు కూడా దీనిని స‌మ‌ర్థించింది.

ఏం చేయాలి?
+ కంట్రోల్ యూనిట్స్ తెచ్చినప్పుడు సీల్స్ సరిగ్గా లేకున్నా.. రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. గ్రీన్ సీల్ బ్రేక్ అయి ఉంటే రిట‌ర్నింగ్ అధికారికి చెప్పాలి.

+ యూనిట్‌ను తీసుకెళ్లి దానికి సంబంధించిన వీవీ ప్యాట్ మెషీన్ ను తెప్పించి దానిలో స్లిప్స్ కౌంట్ చేస్తారు. అయితే, ఈ ప్రక్రియ కౌంటింగ్ చివరలో సాగుతుంది.

+ ఒకవేళ కంట్రోల్ యూనిట్ ఆన్ కాకుంటే ఆర్వోకి తెలియజేయాలి.  అప్పటికీ పని చేయకపోతే.. పక్కకు తీసుకెళ్లి ఆ కంట్రోల్ యూనిట్ కు సంబంధించి వీవీ ప్యాట్ స్లిప్స్ కౌంట్ చేస్తారు.

+ మీ '17C ఫాం' లోని మొత్తం ఓట్లు కంట్రోల్ యూనిట్‌లో చూపించిన ఓట్లు తేడా ఉంటే ఆర్వోకి తెలియజేయాలి.

+ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ బయటకు రాకూడ‌దు. కౌంటింగ్ ప్ర‌క్రియ‌పై సందేహాలుంటే ఎన్నికల సంఘం ఇచ్చిన హ్యాండ్ బుక్‌లో చూసుకోవాలి.

+ ఎన్నికల రోజు ప్రతి బూత్‌లో పోలింగ్ పూర్తైన తర్వాత మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలతో ప్రిసైడింగ్ అధికారి సంతకంతో పార్టీల ఏజెంట్లు 'ఫామ్ - 17C' తీసుకుంటారు.

+ ఇందులో పోలింగ్ స్టేషన్ పేరు, కోడ్ నెంబర్ వంటి వివరాలు సైతం ఉంటాయి. ఈ ఫామ్స్‌ను నియోజకవర్గ పార్టీ ఆఫీస్‌లకు పంపుతారు. కౌంటింగ్ రోజు వీటిని ఏజెంట్లు తమ వెంట తీసుకెళ్తారు.

+ ప్రతి ఈవీఎంలోనూ పోల్ అయిన ఓట్లకు, ఫామ్ - 17Cలో నమోదు చేసిన ఓట్లకు లెక్క సరిపోలాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ కూడా.. అభ్య‌ర్థుల త‌ర‌ఫున హాజ‌ర‌య్యే.. ఏజెంట్ల‌త కావ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: