ఏపీ: పగడ్బంధీగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు: ఎన్నికల సంఘం

Suma Kallamadi
జూన్ 4న జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఎన్నికల సంఘం కొన్ని రకాలైన మార్గదర్శకాలు విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకే స్టార్ట్ కాబోతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలతోపాటుగా రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌లు, పోస్టల్ బ్యాలెట్‌ల నుంచి ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు కీలక సూచనలు చేసింది ఈసీ. జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్ ఓ (రిటర్నింగ్ అధికారులు), కౌంటింగ్ కేంద్రాలలో పరిశీలకులు, చుట్టుపక్కల కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి సూచనలను కట్టుదిట్టంగా, పగడ్బంధీగా అమలుపరచాలని ఆదేశించింది.

అదేవిధంగా ఒకవేళ ఏదైనా పోలింగ్ స్టేషన్‌లో వాయిదా వేసిన పోల్‌పై ECI ఆదేశాలు పెండింగ్‌లో ఉన్నట్లయితే, ఆ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మాత్రం ఆరంభించకూడదు. ముఖ్యంగా ఓటు గోప్యతకి సంబంధించి RO, ప్రజాప్రాతినిధ్య చట్టం1951లోని సెక్షన్ 128, ఎన్నికల నియమావళి 1961లోని రూల్ 54లోని నిబంధనలను ఖచ్చితంగా చదివి తీరాలి. 1961లోని రూల్ 60(ఎన్నికల ప్రవర్తన నియమాలు) ప్రకారం, ఎటువంటి విరామం లేకుండా కౌంటింగ్ కొనసాగాలి. కౌంటింగ్ హాలులో అనధికార వ్యక్తులు ఉంటే బేషరతుగా వారిని పోలీసులకు అప్పగించాలి. ఇక రూల్ 53(4) ప్రకారం, రిటర్నింగ్ అధికారి చట్టబద్ధమైన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే, కౌంటింగ్ కేంద్రం నుండి వారిని బయటకు వెళ్లమని ఆదేశించే అధికారం RO కి ఉందని గుర్తు పెట్టుకోవాలి.

1961లోని రూల్ 54A (ఎన్నికల ప్రవర్తన నియమాలు) ప్రకారం, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు మొదట RO టేబుల్ వద్ద స్టార్ట్ కావాలి. AROలు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు డిక్లరేషన్‌లను పరిశీలించడంలో విపరీతమైన జాప్యం జరగకుండా RO నిర్ధారించాలి. ఫారం-13ఏలోని డిక్లరేషన్‌లో లోపాల కారణంగా పోస్టల్ బ్యాలెట్‌ని తిరస్కరించిన అన్ని కేసులను వాస్తవానికి తిరస్కరించిన కేటగిరీలో చేర్చే ముందు రిటర్నింగ్ అధికారి తిరిగి ధృవీకరించవలసి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ముఖ్యంగా ఫారం 13Aలోని డిక్లరేషన్ పరిశీలనను పరిశీలకుడు చాలా నిశితంగా పర్యవేక్షిస్తారు. ఫలితాల ప్రకటన తర్వాత కౌంటింగ్‌పై నివేదికను సమర్పించేటప్పుడు, అబ్జర్వర్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం అనుసరించిన విధానాన్ని అందులో పొందుపరచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: