ఒకప్పుడు దేశంలో ఎన్నికలు జరిగాయి అంటే నాయకులను చూసి ప్రజలు ఓట్లు వేసేవారు. తర్వాత అభివృద్ధి కోసం నిలదీసేవారు. ప్రస్తుతం ఎన్నికల వెర్షన్ మారిపోయింది. డబ్బు చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. అలా అని ఎంత డబ్బు ఇచ్చినా నాయకుడు గెలుస్తాడనే నమ్మకం కూడా రావడం లేదు. డబ్బు ఎప్పుడైతే ఎన్నికల బరిలో చేరిందో అప్పుడే కులానికి సంబంధించిన ఓట్ల మధ్యలో చీలిక వచ్చింది. ఒక కులంలో ఉన్న వారు అదే కులానికి చెందిన నాయకునికి ఓటు వేయాలని కొన్ని సంవత్సరాల కింద డిసైడ్ అయ్యేవారు. అందులో కాస్త మార్పు వస్తోంది. ఏ కులం వారు ఆ కులానికి ఓటు వేయాలి అనేదానిపై వ్యతిరేకత కూడా ఏర్పడుతోంది. వీటన్నింటికీ ప్రధాన కారణం డబ్బు అని చెప్పవచ్చు. కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడాలి అంటే తప్పనిసరిగా ఓ 10 కోట్లకు పైగా అని డబ్బు ఉండాలి.
ఓ మోస్తారు గ్రామపంచాయతీలో సర్పంచ్ అవ్వాలంటే కనీసం 10 లక్షల పైన డబ్బు ఖర్చు చేయాల్సిందే. డబ్బుతో పాటు కాస్త మంచి పేరు ఉంటే చాలు ఆ నాయకుడు తప్పనిసరిగా గెలిచినట్టే. తాజాగా ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిసాయి. ఇక్కడ కూడా అన్ని నియోజకవర్గాల్లో డబ్బు ప్రలోభాలు నడిచాయి. మే 13న ఎన్నికల ముగిసిపోయాయి. అప్పుడు మొదలైంది అసలు చర్చ. ఆ నాయకుడు దగ్గర డబ్బు తెచ్చుకుని దాచుకున్నాడని ఎవరికి పంచలేదని అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇదే ఆరోపణ పీక్స్ స్థాయికి చేరుకుంది. కొడాలి నాని మెడకు చుట్టుకుంది. తాజాగా కొడాలి నాని అనుచరుడు డబ్బు పంపకాల విషయంలో వచ్చిన వైరం గురించి ఒకటి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు కొడాలి నాని తన అనుచరులకు ఇచ్చి పంచమని చెబితే కొంతమంది నాయకులు కోట్లాది రూపాయలను వెనుకేసుకున్నారని, ఎవరికి పంచలేదని విదేశాలకు వెళ్లి జల్సాలు చేయడానికి సిద్ధమవుతున్నారని వైసిపికి చెందినటువంటి మైనార్టీ నాయకుడు సర్దార్ బేగ్ ఒక వీడియోను విడుదల చేశారు.
చిన్ని అన్నా మీరు పంపిన డబ్బులు మాయం చేసిన వారిని కేకే కళ్యాణ మండపానికి పిలిచి నిలదీయండి. పంచిన వారిని వదిలేయండి పంచని వారిని ప్రశ్నించండి చిన్ని అన్నా అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. నమ్మకద్రోహం చేసిన వాళ్లలో 10, 11,12 వార్డుల వారు ఉన్నారు. వారందరిని నిలదీసి అడగండి చిన్ని అన్నా అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. వీరంతా గోవా, సింగపూర్, మలేషియా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వెంటనే మీరు రెస్పాండ్ అవ్వండి అంటూ వైసిపి నాయకుడు పెట్టిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకు పనికిరాని వ్యక్తుల దగ్గర కూడా 50,000 కట్టలు కనిపిస్తున్నాయి. నాని గెలుపు కోసం కష్టపడిన మా కుర్రోళ్ళ దగ్గర కనీసం తిందామంటే రూపాయి లేదు. మేము సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు పెట్టి అన్నని గెలిపించుకునే ప్రయత్నం చేసాం. కానీ మీ దగ్గర డబ్బులు నొక్కేసినోళ్లు మాత్రం ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్తున్నారు చిన్ని అన్నా, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా అంటూ ఆ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది.