ఏపీలో ఎన్నికల పందేరాలకు అన్ని వేల కోట్లా... డబ్బుతో దుమ్ము రేపే నియోజకవర్గాలివే..!
- గోదావరి జిల్లాల్లో గడ్డి వాముల్లోనే నోట్ల కట్టలు
- మొత్తం 50 వేల కోట్లు పంపకాలకు రెడీ..!
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
ఒకటి కాదు.. రెండు కాదు.. వందల వేల కోట్ల రూపాయలు. గడ్డివాముల్లోనూ.. గుడిసెల ఇళ్లలోనూ.. నోట్ల కట్టలు దాచారనేది ఎన్నికల సంఘానికి అందిన సమాచారం. అయితే.. ఎక్కడ? ఏ ఇల్లు.. ఎక్కడ వెతకాలి? ఇది ఎవరి పని? అనేదే ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది. ప్రచారాలు పరిసమాప్తం అయ్యే నాటి కి.. ఈ డబ్బుల కట్టలకు.. కదలిక వస్తుంది. ప్రజలను ప్రలోభాలకు గురి చేసేందుకు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేకుండా అన్ని పార్టీలూ రెడీ అయ్యాయి.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. సుమారు 20 వేల కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. మరో 50 వేల కోట్ల వరకు.. దాచి పెట్టారనేది పక్కా సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని గడ్డివాముల్లో.. ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే.. ఇక్కడ గడ్డి వాములను వేయొద్దంటూ.. తాజాగా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
కీలక నియోజకవర్గాలుగా చెబుతున్న మంగళగిరి, పుంగనూరు, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, విజయ వాడ వెస్ట్, అనకాపల్లి, రాజమండ్రి, కుప్పం, పీలేరు, రాజంపేట పార్లమెంటు స్థానం సహా.. సుమారు 30 నియోజకవర్గాల్లో డబ్బులు డామినేషన్ చేయనున్నట్టు చెబుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘం కూడా.. ఒక నిర్ణయానికి వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలకు నాలుగు రోజుల ముందే కేంద్ర బలగాలను పంపించాలని నిర్ణయించింది.
ఫలితంగా ప్రచారం అయిపోయిన తర్వాత.. డబ్బులు పారకుండా చూడాలనేది ఎన్నికల సంఘం తీసుకుంటున్న కీలక చర్య కానీ.. ఎప్పుడూ డబ్బులు పంపించే.. నాయకులు.. వీటిని చాలా వ్యూహాత్మకంగా పంపిణీ చేసే కార్యకర్తలు ఉన్నంత వరకు.. ఎన్నికల సంఘాలు విఫలమవుతూనే ఉన్నాయి. చిత్రంఏంటంటే.. డబ్బులు పంచుతున్నది ఎవరో తెలిసినా.. వైసీపీ, టీడీపీల్లో మాత్రంఆందోళన, ఆవేదన కనిపిస్తోంది. దీనికి కారణం.. తమకంటే.. ఎక్కువ పంపిణీ చేస్తారేమోనన్న భయం. మరి చూడాలి.. ఎవరు పైచేయి సాధిస్తారో..!