అనిల్ కుమార్ యాదవ్: ఇంటికాడ పులే..మరి ఇంటి బయట?

FARMANULLA SHAIK
• పల్నాడు గడ్డపై నెల్లూరు సీన్ రిపీట్ చేసేందుకు కంకణం కట్టుకున్న అనిల్
* చేసిన అభివృద్ధిని నమ్ముకొని ముందుకుపోతున్న లావు
• ఈసారి కూడా భారీ ఆధిక్యంపై వైసీపీ గురి
ఆంధ్రప్రదేశ్లో మరో వారం రోజుల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మరియు 25 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికలలో భారీగా విజయం సాధించిన అధికార పార్టీ వైసిపి ఈసారి కూడా అదే తరహాలో గెలుపు కోసం అనేక వ్యూహాలు చేపట్టింది. దాంట్లో భాగంగానే అనేకచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరియు ఎంపీలను స్థానచలనం చేసింది.అందులో ఒకటైన పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి అధికార పార్టీ వైసీపీ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను బరిలోకి దించింది. నిజానికి అనిల్ కుమార్ యాదవ్  నెల్లూరు నుంచి రెండుసార్లు వైసీపీ తరఫున  అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందారు ఇటీవల జగన్ క్యాబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ప్రస్తుతం నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం అనిల్ కుమార్ యాదవ్ కు స్థానచలనం చేయక తప్పలేదు. అయితే అనిల్ కుమార్ మాత్రం తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు శిరసావహించి స్థానచలనానికి ఒప్పుకున్నారు. దాంట్లో భాగంగానే పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ టికెట్ అనిల్ కేటాయించారు. 

కాకపోతే అప్పటికే వైసిపి సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను అక్కడి నుంచి తప్పించి గుంటూరుకి పంపే ఆలోచన జగన్ చేసినప్పటికీ  దానికి లావు ఒప్పుకోలేదు. ఏదేమైనా చివరికి నరసరావుపేట పార్లమెంట్ టికెట్ మాత్రం అనిల్ కి కేటాయించింది వైసీపీ అధిష్టానం. దాంతో అలకపూనినా లావు వైసీపీ పార్టీని వీడి టిడిపిలో చేరారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఏమాత్రం వ్యతిరేకత లేనటువంటి లావుకి మరల టిడిపి అక్కడే టికెట్ కేటాయించింది. దాంతో నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో వీరిద్దరూ నువ్వా నేనా అంటూ తలబడుతున్నారు. బీసీ సామాజిక వర్గం అండగా ఉన్న అనిల్ కు కూడా ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఇంకోవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన అభివృద్ధి కూడా ప్రజలు మెచ్చుకుంటున్నారు.అయితే ఇక్కడ వీరి మధ్య ఫైట్ మాత్రం రసవత్తరంగా సాగుతుంది. కాకపోతే అనిల్ కుమార్ మాత్రం నాన్ లోకల్ అవడంతో ప్రజలు కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. చివరికి ఫ్యాను గాలి కంటే అక్కడి ప్రజలు సైకిల్ ఎక్కి పోవాలనే ఆలోచనతో ఉన్నానని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: