అమరావతి : షర్మిల అవకాశవాదానికి నిదర్శనమా ?
కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆలోచనలు, వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. తన ప్రత్యర్ధిపైన తాను నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తు బురదచల్లేయచ్చు. అదే ఎదుటి పార్టీ మాత్రం తనను ఏమీ అనకూడదట. తాను చల్లేసిన, చల్లుతున్న బురదను నీళ్ళు పెట్టి కడుక్కుంటు కోర్చోవాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తు షర్మిల చేస్తున్న ఆరోపణలు అందరు చూస్తున్నదే.
మొదట్లో జగన్ చెల్లెలు కదాని మంత్రులు, వైసీపీ నేతలు కాస్త సంయమనం పాటించారు. అయితే దాన్ని అలుసుగా తీసుకున్న షర్మిల సోదరుడిపై ఆరోపణలతో మరింతగా రెచ్చిపోతున్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ఎల్లోమీడియా కళ్ళలో ఆనందం చూడటానికే జగన్ పైన షర్మిల ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారని అధికారపార్టీ నేతలకు అర్ధమైంది. దాంతో వెంటనే షర్మిలపై ఎదురుదాడి మొదలుపెట్టారు. దాన్ని షర్మిల సహించలేకున్నారు, తట్టుకోలేకపోతున్నారు.
అందుకనే తాను మహిళనని కూడా చూడకుండా, సొంతచెల్లెలు అని కూడా చూడకుండా నేతలతో తిట్టిస్తారా అంటు మండిపోతున్నారు. ఇక్కడ షర్మిల అవకాశవాదం ఏమిటంటే నేతలు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆరోపణలను జగన్ కు ఆపాదించటం. జగన్ చెబితేనే, చెప్పినట్లుగానే మంత్రులు, నేతలు తనపైన ఆరోపణలు చేస్తున్నారంటు జనాల్లో సానుభూతిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. తానేమో ఇంటి వ్యవహారాలను కూడా రోడ్డున పడేసి రచ్చచేయచ్చు. జగన్ను విలన్ గా జనాల ముందు చిత్రీకరించే ప్రయత్నంచేయచ్చు.
దానికి కౌంటర్ గా మంత్రులు, నేతలు ఎదురుదాడి మాత్రం చేయకూడదట. అన్న అని కూడా చూడకుండా జగన్ పైన బురదచల్లేస్తున్నపుడు జగన్ మాత్రం షర్మిలను చెల్లెలు అని ఎందుకు ఉపేక్షించాలి ? సంబంధంలేని అంశాల్లో జగన్ను లాగుతున్నపుడు, జరుగుతున్న అభివృద్ధిని పట్టించుకోకుండా బురదచల్లేస్తున్న విషయంలో షర్మిలకు లేని ఇంగితం మంత్రులు, నేతలకు మాత్రం ఎందుకుండాలి. రాష్ట్రంలో సంక్షేమపథకాలు అందుతున్న విషయం షర్మిలకు తెలీదా ? భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం, మెడికల్ కాలేజీల భవనాల నిర్మాణాలు, షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం, శ్రీకాకుళం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం జరుగుతున్న విషయం తెలీదా ? ఉత్థానం కిడ్నీ బాధితులకు ఉపశమనంగా మంచినీటి ప్రాజెక్టును రెడీచేసింది, రీసెర్చి సెంటర్, ఆసుపత్రి నిర్మాణం జరిగిన విషయం తెలియకుండానే షర్మిల నోటికొచ్చింది మాట్లాడుతున్నారా .