అమరావతి : భవిష్యత్తే భయపెడుతోందా ?
చంద్రబాబునాయుడును వర్తమానం కన్నా భవిష్యత్తే ఎక్కువగా భయపెడుతున్నట్లుంది. అందుకనే ఎలాగైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. బీజేపీతో పొత్తును ఫైనల్ చేసుకోవటానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. ఇదే విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. అయితే భేటీ వివరాలు బయటకు రాలేదు. పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే బీజేపీ అడిగినన్ని సీట్లు కాకపోయినా ఎన్నోకొన్నయితే ఇచ్చి పొత్తుకు ఒప్పించేస్తారట. బీజేపీతో పొత్తులేకపోతే తనతో పాటు పార్టీకి భవిష్యత్తు ఉండదని చంద్రబాబు భయపడుతున్నారట.
అందుకనే పొత్తుకోసం ఇంతగా కాళ్ళా వేళ్ళా పడుతున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఓట్లు సున్నా. 1 శాతం కూడా ఓట్ షేర్ లేని బీజేపీతో 39 శాతం ఓట్ షేరున్న టీడీపీ పొత్తుకోసం ఎందుకింతగా పరితపిస్తోంది ? ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తులో కొన్ని సీట్లను బీజేపీకి కేటాయించక తప్పదని చంద్రబాబుకు అర్ధమైంది. ఎలాగంటే రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి రావటం ఖాయమని అందరు అనుకుంటున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో కూడా వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ప్రచారం తెలిసిందే. నరేంద్రమోడీ ప్రధానమంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తనతో పాటు పార్టీ బతుకు ఏమవుతుందో అనే బెంగ చంద్రబాబులో పెరిగిపోతోందట. పార్టీకి భవిష్యత్తు లేకపోతే ఇక లోకేష్ భవిష్యత్తు కూడా దుర్భరమే. అందుకనే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోయినా ఎన్డీయే పార్టనర్ హోదాలో తనకు రక్షణ దొరుకుతుందని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లున్నారు.
అదృష్టం ఉంటే ఎన్డీయే పార్టనర్ హోదాలో కేంద్రప్రభుత్వంలో టీడీపీలో ఒకరిద్దరికి మంత్రిపదవులు కూడా దక్కుతాయి. ఎన్డీయే పార్టరన్ హోదాలో పార్టీకి ఎంతో కొంత ఊపిరి దొరుకుతుంది. అలాకాకుండా పైన మోడి అండలేకుండా రాష్ట్రంలో జగన్ వాయింపుడు మొదలైతే తట్టుకోలేక చంద్రబాబు దిక్కులు చూడాల్సిందే. స్కిల్ స్కామ్ లో అరెస్టయి 53 రోజులు రిమాండులో ఉన్నపుడే చంద్రబాబుకు భవిష్యత్ దర్శనం అయ్యిందట. అందుకనే పదిసీట్లు పోయినా పర్వాలేదు అర్జంటుగా ఎన్డీయేలో పార్టనర్ అనిపించుకోవాలన్నది చంద్రబాబు ఆతృత. దాని పర్యవసానమే బీజేపీతో పొత్తుచర్చలు.