హైదరాబాద్ : జగన్ కు అవమానం జరిగిందా ?
సోదరి వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్ధ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగిందా ? జగన్ కు అవమానం జరిగిందని సోషల్ మీడియాతో పాటు ఎల్లోమీడియా కూడా బాగా హైలైట్ చేసింది. ఇందులో కొంత వాస్తవం మరికొంత అవాస్తవం ఉందని అనిపిస్తోంది. విషయం ఏమిటంటే హైదరాబాద్ లోని ఒక రిసార్ట్స్ లో షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్ధం జరిగింది.
ఆ కార్యక్రమానికి జగన్ తో పాటు భార్య భారతి కూడా హాజరయ్యారు. కార్యక్రమం జరిగే రిసార్ట్స్ లో షర్మిలతో పాటు భర్త బ్రదర్ అనీల్, జగన్ తల్లి విజయమ్మతో పాటు చాలామంది బంధువులున్నారు. కార్యక్రమానికి వచ్చిన జగన్ దంపతులను షర్మిల రిసీవ్ చేసుకున్నారు. తర్వాత జగన్ దంపతులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు నిలుచున్న వేదిక మీదకు వెళ్ళారు. ఆ సందర్భంగా షర్మిల ఆమె భర్త అనీల్ వేదికమీద ఉన్నా జగన్ దంపతులకు దూరంగానే ఉన్నారు. జగన్ దంపతులకు షర్మిల దంపతులకు మధ్యలో విజయమ్మ నిలబడున్నారు.
పెళ్ళికొడుకు, పెళ్ళికూతురితో జగన్ దంపతులు ఫొటోలు దిగిన తర్వాత తల్లి, చెల్లెలు, అనీల్ తో కలిసి గ్రూప్ ఫొటో తీసుకోవాలని జగన్ అనుకున్నారు. షర్మిలను, అనీల్ ను రమ్మని జగన్ అడిగితే వాళ్ళు దగ్గరకు రాలేదు. జగన్ దగ్గరకు రావటానికి షర్మిల ఇష్టపడలేదు. జగన్ ఒకటికి రెండుసార్లు పిలిచినా రాకుండా తిరస్కరించారు. చివరకు విజయమ్మ పిలిచినా కూడా షర్మిల రావటానిక ఇష్టపడలేదు.
దాంతో చేసేదిలేక జగన్ దంపతులు వేదిక దిగి వెళ్ళిపోయారు. ఈ వ్యవహారం మొత్తం వీడియోల్లో, ఫొటోల్లో స్పష్టంగానే కనబడింది. కొడుకు నిశ్చితార్ధానికి జగన్ను పిలిచిన షర్మిల మరి వచ్చిన తర్వాత గ్రూప్ ఫొటో తీసుకోవటానికి ఎందుకు ఇష్టపడలేదో అర్ధంకావటంలేదు. మళ్ళీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చినపుడు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురును దగ్గరుండి వపన్ కు పరిచయం చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే జగన్ కు అవమానం జరిగినట్లు బాగా ప్రచారం జరుగుతోంది.