గోదావరి : రెబల్ ఎంపీ కావాలనే చేస్తున్నారా ?

Vijaya

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు బుద్ధి ఎప్పటికీ మారదేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో గొడవ మొదలైన దగ్గర నుండి భయంతో నియోజకవర్గం నరసాపురంను వదిలేసి ఢిల్లీకే పరిమితమైపోయారు. పండక్కో, పబ్బానికో అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చేవారు. అయితే ఒక కేసులో సీఐడీ అరెస్టు చేసి విచారణ పేరుతో బాగా సత్కరించింది. ఆ దెబ్బకు అసలు రాష్ట్రానికి రావటమే మానుకున్నారు. అప్పటినుండి మీడియా సమావేశంలో ప్రతిరోజు జగన్ పై బురదచల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇది సరిపోదన్నట్లు జగన్ బెయిల్ రద్దుపై కోర్టుల్లో కేసుల మీద కేసులు వేస్తునే ఉన్నారు.





సరే ఇదంతా చరిత్ర అనుకుంటే తాజాగా కోర్టు ఆదేశాలతో రాజు నరసాపురంలోకి అడుగుపెట్టారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా  కోళ్ళపందేల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతు వైసీపీని రెచ్చగొట్టారు. తానంటే వైసీపీ శ్రేణులు భయపడినట్లు చెప్పారు. గతంలో తాను నియోజకవర్గంలోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్న శ్రేణులు ఇపుడు తన జోలికి రాలేకపోయాయని ఎద్దేవాచేశారు. ఎన్నికల సమయంలో తనను నియోజకవర్గంలో అడ్డుకునే సాహసం చేయలేకపోయినట్లు చెప్పారు.





ఇక్కడ రాజు ఉద్దేశ్యం ఏమిటంటే పార్టీ శ్రేణులు తనపైన దాడి చేసేట్లుగా రెచ్చగొట్టడమే. తనపైన పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తారు కాబట్టి తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టులో ఆల్రెడీ రాజు పిటీషన్ వేసున్నారు. ఒకవైపు అదనపు భద్రత కావాలని పిటీషన్ వేసిన ఎంపీ ఇపుడు వైసీపీని రెచ్చగొట్టడం ఎందుకు ? ఎందుకంటే జనాల్లో ముఖ్యంగా తన సామాజికవర్గంలో వైసీపీపై వ్యతిరేకత తీసుకొచ్చి తాను సానుభూతిని పెంచుకోవటం కోసమే.





రాబోయే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగానే పోటీచేయాలని రాజు ప్రయత్నిస్తున్నారు. అవకాశం తక్కువగానే ఉన్నా టీడీపీ+జనసేన కూటమి తరపున టికెట్ కు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా, ఓడిపోయినా రాజు పరువంతా పోవటం ఖాయం. ఖర్మకాలి వైసీపీనే గెలిస్తే రాజు ఇక రాష్ట్రంలో అడుగుపెట్టలేరు. ఈ ప్రమాదాన్ని ఊహించే వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటూనే తాను ఎంపీగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: