అమరావతి : సీనియర్ల నుండి షర్మిలకు షాక్ తప్పదా ?

Vijaya

ఇపుడిదే అంశంపై కాంగ్రెస్ లో పెద్దఎత్తున చర్చ మొదలైంది. ఒక రాష్ట్రానికి చెందిన నేతను మరో రాష్ట్రపార్టీలో కీలక బాధ్యతలు అప్పంగాలని  అనుకోవటం  వైఎస్ షర్మిలతోనే మొదలైనట్లు పార్టీలో సెటైర్లు పేలుతున్నాయి. పార్టీ నేతల ఉద్దేశ్యంలో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు అప్పగించబోతున్నారట.  దీనికి కారణం సీనియర్ నేత, అమలాపురం మాజీ ఎంపి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలే. హర్షవర్ధన్ మాట్లాడుతు తెలంగాణా బిడ్డ షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం చాలా విచిత్రంగా ఉందన్నారు. ఆమె కూడా పార్టీలో కీలకపాత్రే పోషించబోతున్నట్లు చెప్పుకోవటాన్ని హర్ష తప్పుపట్టారు. అంటే షర్మిలను కాంగ్రెస్ లోని కొందరు తెలంగాణా బిడ్డగానే చూస్తున్నారు.





షర్మిలను హర్ష ఇంతగా వ్యతిరేకించటానికి కారణం ఏమిటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో పడకపోవటం. అలాగే జగన్మోహన్ రెడ్డితో కూడా మాజీ ఎంపీకి ఏమాత్రం పడదు. అందుకనే వైసీపీలో చేరి వెంటనే బయటకు వచ్చేశారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే తెలంగాణాలో షర్మిల వైఎస్సార్టీపీ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ళపాటు ఎంత అవస్తలు పడినా పార్టీ ఉనికిని కూడా షర్మిల చాటలేకపోయారు. ఆ సందర్భంగా షర్మిల ఎక్కడ మాట్లాడినా తాను తెలంగాణా బిడ్డనే అన్న విషయాన్ని పదేపదే చెప్పుకున్నారు.





తాను పుట్టింది, చదువుకున్నదంతా తెలంగాణాలోనే అని చాలాసార్లు చెప్పారు. తాను తెలంగాణా ఆడపడుచునని, ఖమ్మం కోడలినని షర్మిల బాగా ప్రచారం చేసుకున్నారు. ఎంత ప్రచారం చేసుకున్నా, ఎంత మొత్తుకున్నా ఆమెను జనాలు పట్టించుకోలేదు. ఇక వేరేదారిలేక పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. ఆమె తెలంగాణాలో జరిపిన పాదయాత్రలో కూడా కాంగ్రెస్ నేతలను డైరెక్టుగానే ఎటాక్ చేసేవారు. వైఎస్సార్ కు కాంగ్రెస్ అధిష్టానం చేసిన అన్యాయాన్ని పదేపదే ప్రస్తావించారు.





ఈ నేపధ్యంలోనే తెలంగాణా బిడ్డ షర్మిలకు ఏపీలో సారధ్యం ఎలా అప్పగిస్తారని హర్ష లేవనెత్తిన అభ్యంతరాలకు పార్టీలో సానుకూల స్పందన మొదలైంది. అక్కడక్కడ కొందరు నేతలు మాజీ ఎంపీ అభ్యంతరాలకు మద్దతుగా  మాట్లాడుతున్నారు. మొత్తానికి ఒకపుడు నోటికొచ్చినట్లు షర్మిల ఏదేదో మాట్లాడిన మాటలను ఇపుడు కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తుండటం గమనార్హం. హర్ష అభ్యంతరాలు, వ్యాఖ్యలను అధిష్టానం పట్టించుకుంటుందా లేదా అన్నది  వేరే విషయం. షర్మిలను కాంగ్రెస్ లో కొందరు వ్యతిరేకిస్తున్నారన్నవిషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: