అమరావతి : కేశినేని నిర్ణయంతో షాక్ తప్పదా ?

Vijaya


తెలుగుదేశంపార్టీ నుండి ఎంపీ కేశినేని నానిని బహిష్కరించిన తర్వాత పరిణామాలు చాలా స్పీడుగా జరుగుతున్నాయి. తొందరలో జరగబోయే ఎన్నికలకు ముందు ఎంపీని చంద్రబాబునాయుడు బహిష్కరించటం అంటే మామూలు విషయంకాదు. ఎవరిపైనా యాక్షన్ తీసుకోవటానికి చంద్రబాబు ధైర్యంచేయరు. ఇపుడు కూడా ఎంపీని బహిష్కరిస్తున్నట్లు డైరెక్టుగా ప్రకటించలేదు. తిరువూరు బహిరంగ సభ ఏర్పాట్లకు దూరంగా ఉండమని, విజయవాడ ఎంపీగా కేశినేని చిన్నీకి టికెట్ ఇస్తున్న కారణంగా పార్టీకి దూరంగా ఉండమని మాత్రమే చంద్రబాబు కబురుచేశారు.



చంద్రబాబు కబురు సారాంశం ప్రకారం ఎంపీని టీడీపీ నుండి బహిష్కరిస్తున్నట్లు అందరు అనుకుంటున్నారు. రేపొద్దున ఎంపీ ఇంటికొచ్చి చంద్రబాబు భేటీ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే తాజా పరిణామాలతో చంద్రబాబుపైన ఎంపీ మండిపోతున్నారు. ఇదే సమయంలో కేశినేనికి పాజిటివ్ గా వైసీపీలో డెవలప్మెంట్లు మొదలయ్యాయి. గతంలోనే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున కేశినేని నాని పోటీచేసే అవకాశముందని పై స్ధాయిలో చర్చలు జరిగాయి. అయితే తర్వాత ఎందుకనో ఆ ప్రచారం ఆగిపోయింది.



అప్పట్లో ఆగిపోయిన చర్చలు ఇపుడు మళ్ళీ మొదలయ్యాయి. ఎంపీ కోణంలో చూస్తే బీజేపీలో చేరలేరు. ఎందుకంటే బీజేపీ కూడా టీడీపీ+జనసేన కూటమిలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం పెరిగిపోతోంది కాబట్టి. నానికి ఉన్న ఆప్షన్లు ఏమిటంటే పోటీచేసే ఆలోచనలో ఉంటే ఇండిపెండెంటుగా పోటీచేయటం. అయితే గెలుపు అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. దీనివల్ల చంద్రబాబు మీదున్న మంట చల్లారదు. అదే వైసీపీలో చేరి పోటీచేస్తే గెలుపు అవకాశాలు కూడా ఉన్నాయి. గెలిస్తే చంద్రబాబును దెబ్బతీసినట్లవుతుంది. ఎంపీ ఇగో కూడా శాటిస్ ఫై అవుతుంది.



ఇపుడు ప్రచారం జరుగుతున్నట్లు  నాని గనుక వైసీపీలో చేరితే చంద్రబాబుకు షాక్ తప్పదనే అనుకోవాలి. ఎలాగంటే నానికి విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను గట్టి మద్దతుదారులున్నారు. పార్టీతో సంబంధంలేకుండా టాటా ట్రస్ట్ తరపున సామాజిక కార్యక్రమాలను చేస్తున్నారు. కాబట్టి సానుకూల ఓటింగ్ కూడా ఉంది. వ్యక్తిగత ఇమేజికి తోడు వైసీపీ బలంకూడా తోడైతే గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. నాని గనుక వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీచేస్తే పోటీ మాత్రం భలేగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: