అమరావతి : వీళ్ళకు యుద్ధంచేసేంత సీనుందా ?

Vijaya


యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగసభలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ పదేపదే ఒక అంశాన్ని ప్రస్తావించారు. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా యుద్ధం  మొదలైందట. కురుక్షేత్ర యుద్ధంలో జగన్ ఓటమి ఖాయమైపోయిందట.    వీళ్ళ ముగ్గురు యుద్ధంగురించి మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళల్లో  ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చేయలేకపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో విడివిడిగా పోటీచేస్తే వీరస్వర్గం తప్పదని పవన్ ఎప్పుడో అంగీకరించారు. అలాగే ఈమధ్య తమ్ముళ్ళతో జరిగిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో కూడా ఓడిపోతే తానిక రాష్ట్రానికి రానని చెప్పేశారు.





స్కిల్ స్కామ్ లో చంద్రబాబును సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టు కాగానే పాదయాత్రను లోకేష్ అర్ధాంతరంగా ముగించి ఢిల్లీకి పారిపోయాడు. మధ్యలో ఒకటిరెండుసార్లు రాజమండ్రికి వచ్చినా మళ్ళీ వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయాడు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత కాని ఏపీలోకి లోకేష్ అడుగుపెట్టలేదు.  పవన్ కల్యాణ్ వ్యవహారం తీసుకుంటే వారాహియాత్రను మధ్యలోనే వదిలేశారు. ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో కొన్ని  నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో తిరిగిన తర్వాత వారాహియాత్రను ఆపేశారు.





చంద్రబాబు జైలులో ఉన్నపుడు భార్య భువనేశ్వరి భరోసాయాత్రను మొదలుపెట్టారు. చంద్రబాబు అరెస్టుతో గుండాగి చనిపోయిన, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించేందుకు భరోసాయాత్ర మొదలుపెట్టారు.  మూడు కుటుంబాలను కలిసిన  తర్వాత చంద్రబాబు జైలు నుండి విడుదలయ్యారు. దాంతో భువనేశ్వరి కూడా భరోసాయాత్రను ముగించేశారు. భువనేశ్వరితో భరోసాయాత్రను పూర్తి చేయించాలనే ఆలోచన కూడా చంద్రబాబు, లోకేష్ లో కనిపించలేదు. జగన్ను ఎదుర్కోవటం కష్టమని అర్ధమైపోయి ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకున్నారు. చంద్రబాబు, పవన్ తరపున ఎల్లోమీడియానే జగన్ పై యుద్ధం ప్రకటించి అవిశ్రాంతిగా బురదచల్లే కార్యక్రమంలో బిజీగా ఉంది.





ప్రత్యర్ధి జగన్ను  డైరెక్టుగా  ఎదుర్కోలేకపోతున్న చంద్రబాబు, పవన్ , లోకేష్ కూడా యుద్ధం ప్రారంభించామని, యుద్ధంలో జగన్ ఓటమి ఖాయమని ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. గెలుపోటములు వేరే సంగతి అసలు ఒంటరిపోరుకే వీళ్ళు భయపడుతున్నారు. ఒకవైపు జగనేమో ఎంతమంది ఏకమై వచ్చినా తాను ఒంటరిగానే పోరాటం చేస్తానని సవాలు విసురుతున్నారు. సవాలును స్వీకరించే ధైర్యం కూడా లేని వాళ్ళందరు కలిసి జగన్ పై యుద్ధం మొదలైందని ప్రకటించటమే విడ్డూరంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: