అమరావతి : ఇంకా ఫిరాయింపుల బుద్ది పోలేదా ?

Vijaya


వినేవాళ్ళుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో విలువల గురించి చంద్రబాబునాయుడుకన్నా ఎక్కువగా చెప్పే నేతలుండరు. కానీ చేసేది మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఇందుకు తాజాగా జరిగిన పరిణామాలే నిదర్శనం. శుక్రవారం పార్టీ ఆపీసులో వైసీపీ సస్పెండెడ్ ఎంఎల్ఏలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను పార్టీలో చేర్చుకున్నారు. నలుగురు ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీదరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను  వైసీపీ  సస్పెండ్ చేసిందే కానీ బహిష్కరించలేదు.





అయితే సస్పెండ్ చేసిన దగ్గరనుండి పై నలుగురు ఎంఎల్ఏలు పార్టీతో సంబంధంలేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. వీళ్ళని సస్పెండ్ చేసిందే వైసీపీలో ఉంటు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని. అప్పటినుండి వీళ్ళు టీడీపీతోనే తిరుగుతున్నారు కానీ పార్టీలో మాత్రం చేరలేదు. అలాంటిది శ్రీదేవి, మేకపాటి మాత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధ్యక్షుడే వీళ్ళకి కండువాలు కప్పారంటే అధికారికంగా టీడీపీలో చేరిపోయినట్లే లెక్క.





ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే టీడీపీలో చేరేముందు వీళ్ళతో ఎంఎల్ఏల పదవులకు చంద్రబాబు రాజీనామాలు చేయించకపోవటం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం చంద్రబాబుకు బాగా అలవాటే. అందుకనే ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేయించకుండానే వీళ్ళని పార్టీలో చేర్చుకున్నారు. 2014లో అధికారంలోకి రాగానే వైసీపీకి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభానికి గురిచేసి పార్టీలోకి లాక్కున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత  కూడా చాలామందిని లాక్కుని జగన్మోహన్ రెడ్డికి  ప్రధాన  ప్రతిపక్ష హోదా లేకుండా దెబ్బకొట్టాలని ప్రయత్నించినా సాధ్యంకాక వదిలేశారు.





వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుతో పడక నలుగురు ఎంఎల్ఏలు కరణం బలరామ్, వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్ జగన్ కు దగ్గరయ్యారు. అయితే వాళ్ళని జగన్ వైసీపీలో చేర్చుకోలేదు. అసెంబ్లీలో కూడా వాళ్ళు ప్రత్యేకంగానే కూర్చునేవారు. తాజా పరిణామం చూసిన తర్వాత చంద్రబాబుకు ఇంకా ఫిరాయింపుల బుద్దిపోలేదని  అర్ధమైంది. వీళ్ళని ఎంఎల్ఏల హోదాలో చేర్చుకున్నా ఒకటే ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేయించి మాజీ ఎంఎల్ఏలుగా చేర్చుకున్నా ఒకటే. పొద్దున లేచిన దగ్గర నుండి ప్రజాస్వామ్యం, విలువల గురించి గంటలపాటు మాట్లాడే చంద్రబాబు తాను మాత్రం కనీస విలువలు పాటించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: