ఢిల్లీ : భద్రత మరీ ఇంత డొల్లా ? 18 నెలల వ్యూహమా ?
పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే మన భద్రతా వ్యవస్ధనే చెప్పుకోవాలి. మన భద్రతా వ్యవస్ధ ఎంత పటిష్టంగా(బలహీనంగా)ఉంటుందనే విషయం బుధవారం మరోసారి బయటపడింది. ప్రపంచదేశాల ముందు మన పరువు తీసేసింది. బుధవారం మధ్యాహ్నం నలుగురు ఆగంతకులు పార్లమెంటులోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇందులో ఒక యువకుడు పార్లమెంటు సెషన్ జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీలో నుండి పార్లమెంటు హాలులోకి దూకాడు. తర్వాత టియర్ గ్యాస్ రిలీజ్ చేశాడు. ఈ ఘటనతో యావత్ దేశం షాక్ తిన్నదనే చెప్పాలి.
యువకుడు ఎప్పుడైతే పార్లమెంటులోకి దూకాడో వెంటనే ఎంపీలు భయపడిపోయి బయటకు పరుగులు తీశారు. లోపలికి దూకినవెంటనే యువకుడు బూట్లలో నుండి టియర్ గ్యాస్ క్యాన్ తీసి ఓపెన్ చేశాడు. దాంతో అందులోనుండి పార్లమెంటు హాలులో పొగలు వ్యాపించాయి. అయితే ఆ గ్యాస్ పెద్దగా ప్రమాదకరం కాదు కాబట్టి సరిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్లమెంటు సెషన్ జరుగుతున్నపుడు నలుగురు యూత్ పార్లమెంటులోపలికి ఎలా చేరుకోగలిగారు ? పార్లమెంటుకు మూడంచెల పటిష్టమైన భద్రత ఉంటుందని కేంద్రప్రభుత్వం తరచూ చెబుతుంటుంది.
మూడంచెల భద్రతను దాటుకుని యువకుడు పార్లమెంటులో విజిటర్స్ గ్యాలరీదాకా ఎలా చేరుకోగలిగాడు. బూట్లలో టియర్ గ్యాస్ క్యాన్లు ఎలా తీసుకెళ్ళగలిగాడు ? మరి భద్రతా సిబ్బంది అతనిని ఏమి చెక్ చేసినట్లు ? అసలు టియర్ గ్యాస్ క్యాన్ బూట్లలో పెట్టుకుని తీసుకెళ్ళటం సాధ్యమేనా ? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకటంలేదు.
జరిగింది చూస్తుంటే భద్రతా సిబ్బందిలోని ఎవరో నలుగురు యువకులకు బాగా సాయం చేసినట్లు అనుమానంగా ఉంది. యువకులు పార్లమెంటులోకి వచ్చిన తర్వాత ఏమి చేయబోతున్నారో కూడా సాయంచేసిన వ్యక్తులకు బాగానే తెలిసుంటుంది. అమెరికాలో ట్విన్ టవర్స్ ను తాలిబన్లు కూల్చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఆ ఘటన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు అమెరికాలో ఎక్కడా తీవ్రవాదుల దాడి జరగలేదు. ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవటం అంటే అలాగుండాలి.
డిసెంబర్ 13వ తేదీన పార్లమెంటుపై దాడిచేస్తామని ఖలిస్ధాన్ నేతలు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. పార్లమెంటులోకి లోపలకి దూకిన వ్యక్తి టియర్ గ్యార్ ఓపెన్ చేశాడు కాబట్టి సరిపోయింది అదే ఏ తుపాకి తీసుకుని కాల్పులు జరిపుంటే ? లేదా టియర్ గ్యాస్ బదులు విషవాయువును వదులుంటే పరిస్ధితి ఏలాగుండేది ?