హైదరాబాద్ : టీడీపీ బండారాన్ని కాసాని బయటపెట్టారా ?
రాబోయే తెలంగాణా అసెంబ్లీఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ పోటీ చేయకూడదని చంద్రబాబునాయుడు డిసైడ్ చేశారు. ఈ విషయాన్ని ఆదివారం తెలంగాణా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పగానే తమ్ముళ్ళంతా ఒక్కసారిగా మండిపడ్డారు. సరే ఎవరెంత మండిపడినా నిర్ణయమైపోయింది కాబట్టి ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అయితే పరిస్ధితిని సమీక్షించుకున్న తర్వాత సోమవారం రాత్రి అధ్యక్షపదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికీ కాసాని రాజీనామా చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు పోటీకి ఎందుకు దూరంగా ఉండాలని డిసైడ్ చేశారనే విషయాన్ని బయటపెట్టేశారు.
కాసాని మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూర్చేందుకే టీడీపీ పోటీలో నుండి తప్పుకున్నట్లు చెప్పారు. టీడీపీ పోటీలో ఉంటే సీమాంధ్ర ప్రత్యేకంగా కమ్మోరి ఓట్లన్నీ పార్టీల మధ్య చీలిపోతాయట. అప్పుడు కాంగ్రెస్ కు నష్టం వస్తుందని పార్టీలోని కమ్మ నేతలు చెప్పారట. అందుకనే కాంగ్రెస్ ను ఓట్లువేయించి, గెలిపించటమే ధ్యేయంగా ఎన్నికల్లో టీడీపీ పోటీచేయకూడదని చంద్రబాబు డిసైడ్ చేశారని కాసాని వివరించారు. తాను తెలంగాణా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నపుడు ఏపీలోని నేతలు వచ్చి టీడీపీ ఎన్నికల్లో పోటీచేయదని ప్రచారం చేయటం ఏమిటని చంద్రబాబును నిలదీసినట్లు చెప్పారు.
పార్టీలోని కమ్మ నేతలే ఎన్నికల్లో టీడీపీని పోటీలో లేకుండా తప్పించారని కాసాని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీచేయనపుడు ఇక పార్టీ ఎందుకని తీవ్రంగా ప్రశ్నించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత లోకేష్ తో మాట్లాడుదామని 20 సార్లు ప్రయత్నించినా ఒక్కసారిగా కూడా ఫోన్ తీయలేదన్నారు. అందుకనే లోకేష్ చిన్న పిల్లాడో పెద్దోడో అర్ధంకాలేదన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లేయమని చౌదరీలే ప్రచారం చేస్తున్నట్లు కాసాని చెప్పారు. బై ఎన్నికల్లో పోటీచేయకపోతే పర్వాలేదు కానీ జనరల్ ఎన్నికలకు దూరంగా ఉండకూడదని తాను ఎంతచెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదని చెప్పి బాధపడ్డారు. ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ పోటీచేస్తుందట కానీ తెలంగాణాలో మాత్రం ఎన్నికల్లో దూరంగా ఉంటుందట అని చంద్రబాబు నిర్ణయాన్ని కాసాని ఎద్దేవా చేశారు. మొత్తానికి ఎన్నికల బరిలో నుండి టీడీపీ తప్పుకోవటానికి కారణాన్ని కాసాని బహిరంగంగానే చెప్పేశారు. మరి దీని పరిణామాలు ఎలాగుంటాయో చూడాలి.