అమరావతి : టీడీపీ నిరసనల్లో ప్రజలెక్కడ ?
స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టు, రిమాండుకు నిరసనగా తెలుగుదేశంపార్టీ వర్గాలు ఆందోళనలు చేస్తున్నాయి. తాజాగా నిజం గెలవాలి అనే స్లోగన్ తో ఆదివారం రాత్రి 7-7.05 గంటల మధ్య అంటే 5 నిముషాల పాటు తమ్ముళ్ళందరు కళ్ళకు గంతలుకట్టుకుని నిరసన తెలిపారు. లోకేష్, భువనేశ్వరి మొదలుకుని చాలాచోట్ల పార్టీనేతలు, క్యాడర్ నిరసనలో పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే అసలు పాయింట్ ఉంది. అదేమిటంటే టీడీపీ ఇస్తున్న నిరసన కార్యక్రమాల్లో మామూలు జనాలు పెద్దగా పాల్గొనటంలేదు.
లోకేష్ అయినా భువనేశ్వరి అయినా నిరసనలో పాల్గొనమని పిలుపిస్తున్నది మామూలు జనాలకు. కానీ పార్టీ జనాలు తప్ప మామూలు జనాల్లో ఎక్కడా స్పందన కనబడటంలేదు. నిజానికి ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఎన్నిచేసినా ఎలాంటి ఉపయోగాలు ఉండవని అందరికీ తెలిసిందే. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు సీఐడీ కోర్టులో ఆధారాలను చూపించింది. సీఐడీ చూపించిన ఆధారాలతో కోర్టు ఏకీభవించింది.
అందుకనే ఏసీబీ కోర్టు నుండి సుప్రింకోర్టు దాకా ఎక్కడా బెయిల్ దొరకటంలేదు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ఇంకా ఎంతకాలం రిమాండులో ఉంటారో తెలీదు. ఇదికాకుండా ఇంకా నాలుగు కేసులతో సీఐడీ, పోలీసులు కాచుక్కూర్చున్నారు అరెస్టు చేసి విచారణచేసేందుకు. జరుగుతున్నది చూసిన తర్వాత కేసుల నుండి చంద్రబాబు బయటపడటం అసాధ్యమని భువనేశ్వరి, లోకేష్ తో పాటు తమ్ముళ్ళకి బాగా అర్ధమైపోయినట్లుంది. అందుకనే కోర్టులపై మైండ్ గేమ్ మొదలుపెట్టి నిజంగెలవాలని, దీపాలు వెలిగించమని, కళ్ళకు గంతలు కట్టుకోమని చెప్పి నిరసన తెలుపుతున్నారు.
ఇక్కడ వీళ్ళు మరచిపోయిందేమంటే ఎన్నినిరసనలు తెలిపినా ఎలాంటి ఉపయోగముండదని. కేసులో మెరిట్ ప్రకారమే కోర్టులో విచారణ జరుగుతుంది కానీ వీళ్ళ నిరసనల ప్రభావంతో కాదు. ఇక్కడే ఇంకో పాయింట్ ఏమిటంటే వీళ్ళ నిరసన కార్యక్రమాల్లో మామూలు జనాలు పాల్గొనటంలేదని కూడా అందరికీ తెలిసిపోతోంది. నిజంగెలవాలనే పేరుతో చేస్తున్న యాత్రల్లో పాల్గొనమని, మద్దతుగా నిలవమని భువనేశ్వరి బతిమలాడుకుంటున్నా మామూలు జనాలు పట్టించుకోవటంలేదు. నిరసన పిలుపులో పార్టీ నేతలు, క్యాడరే పూర్తిగా పాల్గొనకపోతే ఇక మామూలు జనాలు ఎందుకు పట్టించుకుంటారు ?