హైదరాబాద్ : కోమటిరెడ్డి ప్లాన్ సక్సెస్ అవుతుందా ?

Vijaya

మొత్తానికి రాజకీయం ముసుగులోని వ్యాపారవేత్త కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు మాజీ ఎంఎల్ఏ మొదటినుండి కాంగ్రెస్ లోనే ఉండేవారు. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పొసగని కారణంగా పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పుకున్నారు. నిజానికి సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ కు ఏమాత్రం పడదు. పీసీసీ అద్యక్షపదవి కోసం వెంకటరెడ్డి కూడా విపరీతంగా ప్రయత్నించారు. అయితే అధిష్టానం రేవంత్ కే పగ్గాలు అప్పగించింది.





రేవంత్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి సోదరులకు మండింది. దాంతో చీటికి మాటికి రేవంత్ పై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు. అయితే వీళ్ళ ప్రత్యర్ధులు రేవంత్ కు మద్దతుగా నిలవటంతో రేవంత్ కూడా వీళ్ళని గట్టిగానే ఎదుర్కొన్నారు. దాంతో ఏమిచేయాలో అర్ధంకాక ముందు రాజగోపాలరెడ్డి పార్టీకి రాజీనామా చేసేశారు. దీనికన్నా ముందు బీజేపీలో చేరాలని డిసైడ్ చేసుకున్నట్లు కొన్ని లీకులిచ్చారు. దాంతో బీజేపీ అగ్రనేతలు రాజగోపాల్ తో టచ్ లోకి వచ్చారు. దాంతో చత్తీస్ ఘడ్ లో రు. 18 వేల కోట్ల బొగ్గు కాంట్రాక్టు దక్కించుకున్న తర్వాతే కమలంపార్టీలో చేరారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.





ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటంతో మునుగోడు ఉపఎన్నిక జరిగింది. బీజేపీ తరపున పోటీచేసిన రాజగోపాలరెడ్డి ఓడిపోయారు. తాము నామినేషన్ వేస్తే చాలు గెలిచినట్లే అని అనుకుంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉపఎన్నికలో ఓటమి ఊహించని షాక్ అనే చెప్పాలి. దాంతో తమ కెపాసిటిపై ఉన్న భ్రమలు కాస్త తొలగినట్లే అనుకోవాలి. ఇదే సమయంలో కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు, తెలంగాణాలో బీజేపీ ఊపుతగ్గిపోవటం లాంటి అనేక కారణాలతో రాజగోపాల్ బీజేపీలో ఉండలేకపోయారు.





పొలిటీషియన్ కమ్ కాంట్రాక్టర్లయిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడున్నా తమ వ్యాపార, ఆర్ధిక ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతిస్తారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందనే ఊపును చూసిన తర్వాతే రాజగోపాల్ తిరిగి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మునుగోడు లేదా ఎల్బీ నగర్ అసెంబ్లీ నుండి పోటీచేసే అవకాశముంది. పోటీచేస్తారు సరే మరి గెలుస్తారా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: