అమరావతి : చంద్రబాబుకు ఇన్ని ఎదురు దెబ్బలా ?
జరిగినంతకాలం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇపుడేమో బెయిల్ తెచ్చుకోవటానికి కూడా నానా అవస్తలు పడుతున్నారు. స్కిల్ స్కామ్ లో అరెస్టయి 33 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండు ఖైదీగా ఉంటానని బహుశా చంద్రబాబునాయుడు ఎప్పుడూ అనుకునుండరు. వ్యవస్ధల్లోని తన మనుషులను అడ్డంపెట్టుకుని ప్రత్యర్ధులను రాచిరంపాన పెట్టడం కాదు అదే వ్యవస్ధ తనకు ఎదురుతిరిగితే తన పరిస్ధితి ఏమిటని ఒక్కసారి కూడా చంద్రబాబు ఆలోచించుండరు. దాని పర్యవసానమే ఇపుడీ అవస్తలు.
చంద్రబాబుపై ఒకదాని తర్వాత మరో కేసు వచ్చి మీదపడిపోతోంది. మీదపడుతున్న కేసుల్లో నుండి తప్పించుకోవటం వల్లకావటంలేదు. స్కిల్ స్కామ్ కేసులో నుండి బయటపడటానికి చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేయాల్సొస్తోంది. అంతకన్నా పెద్దకేసులు మరో మూడున్నాయి. ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్ళు అల్లర్ల కేసులు స్కిల్ స్కామ్ కన్నా పెద్ద కేసులట. మరి వీటిల్లో నుండి ఎలా బయటపడతారో చూడాల్సిందే.
ఇపుడు విషయం ఏమిటంటే సుప్రింకోర్టులో విచారణ జరుగుతున్న క్వాష్ పిటీషన్ శుక్రవారానికి వాయిదాపడింది. సోమవారం పూర్తిగా మంగళవారం మధ్యాహ్నం వరకు క్వాష్ పటీషన్ పై జడ్జీలు హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గీ వాదనలు విన్నారు. తర్వాత లంచ్ బ్రేక సమయానికి కేసును శుక్రవారానికి వాయిదావేశారు. అంటే మరో మూడురోజులు చంద్రబాబుకు టెన్షన్ తప్పదు. ఇదే సమయంలో హైకోర్టులో బెయిల్ కోసం వేసిన లంచ్ మోషన్ను కోర్టు డిస్మిస్ చేసేసింది.
స్కిల్ స్కామ్ లో అరెస్టులో తనకు బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో వేసిన పిటీషన్ను డిస్మిస్ అయిపోయింది. అందుకనే బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ కింద అప్పీల్ చేస్తే ఇక్కడా డిస్మిస్ అయిపోయింది. చంద్రబాబు పిటీషన్లు వేసిన ఏ కోర్టులోనూ ఊరట దక్కటంలేదు. ఎంతటి చంద్రబాబుకు ఎంతటి గతిపట్టిందో తలచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేసి వేసి చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలిసిందే. దాని ఫలితమే ఇపుడు అనుభవిస్తున్నారు.