హైదరాబాద్ : పోటీకి భయపడుతున్నారా ?
వినటానికి విచిత్రంగానే ఉన్నా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇది నిజమనే అనుకోవాలి. విషయం ఏమిటంటే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయటానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భయపడుతున్నారని సమాచారం. పొంగులేటి గురించి బయటజరుగుతున్న ప్రచారానికి పార్టీవర్గాలు చెబుతున్నదానికి చాలా తేడా ఉంది. బయటజరుగుతున్న ప్రచారం ఏమిటంటే పొంగులేటి అరవీర భయంకరుడని, ఎక్కడినుండి పోటీచేసినా గెలుపు గ్యారెంటీ అని. ఇందులో కొంతవరకే నిజముంది. అదేమిటంటే పొంగులేటికి ఆర్ధిక, అంగబలం అపారంగా ఉంది అనటంలో సందేహంలేదు.
అయితే ఆర్ధిక, అంగబలాలే అభ్యర్ధిని ఎన్నికల్లో గెలిపించలేవు. అభ్యర్ధిమీద లేదా పార్టీ మీద జనాల్లో ఉన్న సానుకూలతే గెలుపుకు ముఖ్యంగా పనిచేస్తుంది. ఇక్కడ పొంగులేటి మీద సానుకూలత ఉంది. కానీ కాంగ్రెస్ మీద జనాల్లో పాజిటివ్ గా ఉందా లేదా అన్నదే తేలటంలేదు. ఈ కారణంగానే పొంగులేటి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయటానికి వెనకాడుతున్నట్లు సమాచారం. గెలుపు మీద నమ్మకం లేనపుడు పోటీచేయటంలో అర్ధంలేదన్నది పొంగులేటి ఆలోచనగా పార్టీవర్గాలు చెబుతున్నాయి.
అందుకనే పాలేరు లేదా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీపైన ఎక్కువగా దృష్టిపెట్టారట. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే టికెట్ ఇవ్వమని పార్టీ అగ్రనేతలను పొంగులేటి అడిగినట్లు సమాచారం. అయితే ఖమ్మం, పాలేరులో ఇద్దరిలో ఎవరు పోటీచేయబోతున్నారనే విషయాన్ని తేల్చుకోమని పార్టీ అధిష్టానం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటికే వదిలేసినట్లు పార్టీ నేతలు చెప్పారు. ఒకవేళ వీళ్ళిద్దరు తేల్చుకోలేకపోతే చివరకు అధిష్టానమే ఫైనల్ చేసేస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సామాజికవర్గాల సమతూకాన్ని అధిష్టానం ఆలోచిస్తున్నది. ఎలాగంటే మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధి అయిన పువ్వాడ అజయ్ పైన మరో కమ్మ అభ్యర్ధి తుమ్మలను, పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్ధి కందాళం ఉపేంద్రరెడ్డిపైన పొంగులేటిని, కొత్తగూడెంలో ఎంఎల్ఏ, బీసీ నేతైన వనమా వెంకటేశ్వరరావుపై మరో బీసీ నేత దగ్గర బంధువు కృష్ణను పోటీచేయించాలని అనుకున్నది. అయితే పాలేరుపైనే తుమ్మల, పొంగులేటి పట్టుబట్టడం, ఖమ్మంలో పోటీకి వెనకాడటంతో సమస్య పెరిగిపోతోంది. మరి ఈ సమస్యను అధిష్టానం ఎలా తీరుస్తుందనేది ఆసక్తిగా మారింది.