హైదరాబాద్ : రఘునందన్ షాట్ మామూలుగా లేదుగా ? పెద్ద షాక్
పేరుగొప్ప ఊరుదిబ్బంటే బీజేపీనే గుర్తుకొస్తోంది. తమది ఎంతో డిసిప్లిన్డ్ పార్టీ అని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్ధితుల్లోను సహించబోమని కమలనాదులు పదేపదే చెబుతుంటారు. అలాంటి బీజేపీలో నేతల మధ్య విభేదాలు, అసంతృప్తులు ఇపుడు రోడ్డున పడ్డాయి. నేతల మధ్య పంచాయితిచేయలేక, తీర్చలేక అగ్రనేతలకు తలబొప్పి కడుతోంది. తాజాగా దుబ్బాక ఎంఎల్ఏ రఘునదనరావు ఇచ్చిన పంచులకు పార్టీ అగ్రనేతల దిమ్మతిరిగిపోయుంటుంది.
తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కటంలేదని చాలాకాలంగా ఎంఎల్ఏ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే కారణంతో పార్టీమారినా మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఢిల్లీలోని అగ్రనేతల నుండి పిలుపొచ్చింది. ఢిల్లీకి వెళ్ళిన రఘునందన్ అగ్రనేతల ముందు మూడు ఆప్షన్లుంచారు. అవేమిటంటే తనకు బీజేపీఎల్పీ నేతగా నియమించటం, జాతీయ అధికారప్రతినిదిగా అపాయింట్ చేయటం లేకపోతే తెలంగాణా అధ్యక్షుడిని చేయటం. పార్టీకోసం కష్టపడిన తనకు అధ్యక్ష పదవి ఎందుకివ్వరని నిలదీస్తున్నారు.
దుబ్బాకలో తాను, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ తమ ఫేస్ వాల్యుతో గెలిచాము కానీ పార్టీ అభ్యర్ధులుగా కాదని తేల్చేశారు. ముందు తమ ఫేస్ వాల్యు తర్వాతే పార్టీ జెండాని స్పష్టంగా చెప్పేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని గెలిపించుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన మాటేమైందని ప్రశ్నించారు. మునుగోడులో కోమటిరెడ్డిని అమిత్ గెలిపించారా అంటు నిలదీశారు. తరుచుగ్ , సునీల్ బన్సల్ మొహాలు చూసి ఎవరైనా ఓట్లేస్తారా అంటు ఎదురుప్రశ్నించారు.
రెండేళ్ళుగా జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ను, శాసనసభాపక్ష నాయకుడిని కూడా పార్టీ నియమించలేకపోయిందని ఎద్దేవాచేశారు. అసలు పార్టీని నడిపే విధానం ఇదేనా అని మండిపోయారు. రఘునందన్ వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీని వదిలేసేందుకు సిద్ధపడినట్లు అనుమానంగా ఉంది. పార్టీలో కంటిన్యు అవ్వాలని అనుకున్న ఏ నేత కూడా ఇలా మాట్లాడరు. నరేంద్రమోడీతో సమానస్ధాయిని అనుభవిస్తున్న అమిత్ షా ను చులకనగా మాట్లాడారంటేనే రఘునందన్ ఆలోచన ఏమిటో అర్ధమైపోతోంది. మరి రఘు తాజా వ్యాఖ్యలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.