అమరావతి : నాదెండ్ల టీడీపీని తట్టుకోగలరా ?
రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమనే అనుకోవాలి. ఈ నేపధ్యంలోనే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం రెండింటి మధ్య బిగ్ ఫైట్ తప్పదనే అనిపిస్తోంది. ఇలాంటి నియోజకవర్గాల్లో తెనాలి కూడా ఒకటి. తిరుపతి, పిఠాపురం, నరసాపురం, భీమిలి, భీమవరం, రాజమండ్రి లాంటి కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి టీడీపీ, జనసేన రెండూ రెడీ అవుతున్నాయి. పొత్తు కుదిరిన తర్వాత చివరకు ఏపార్టీ పోటీలో ఉంటుందో తెలీదు. అయితే ఈ నియోజకవర్గాలకు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి పెద్ద తేడా ఉంది.
ఆ తేడా ఏమిటంటే జనసేన నుండి నాదెండ్ల మనోహర్ పోటీకి సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో రెగ్యులర్ గా తిరుగుతు పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తును అధినేతలు ఖాయం చేస్తారని చెబుతునే తెనాలిలో పోటీచేయబోయేది మాత్రం తానే అని బహిరంగంగానే ప్రకటించారు. తెనాలి పర్యటనలో తానే అభ్యర్ధినంటు చెప్పుకుంటున్నారు. కాబట్టి నాదెండ్ల వ్యవహారం చూస్తే పోటీ విషయంలో చాలా కాన్ఫిడెంటుగా ఉన్నట్లే అనిపిస్తోంది.
ఇదే సమయంలో మాజీమంత్రి, టీడీపీ సినియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా పోటీకి రెడీ అవుతున్నారు. రాజా కూడా రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయేది తానే అంటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గ్రామస్ధాయి నుండి మద్దతుదారులను, మామూలు జనాలను కలుస్తు తనకే ఓట్లేయాలని అడుతుతున్నారు. తాను పోటీలో ఉండనని కొందరు సంతోషిస్తున్నారని కానీ వాళ్ళ సంతోషం ఎక్కువ రోజులుండదని తాజాగా వ్యాఖ్యానించారు. పోటీచేసేది తానే, గెలిచేదీ తానే అంటు తాజాగా ప్రకటించారు.
పోయిన ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ గెలిచారు. ఆలపాటికి సుమారు 76 వేల ఓట్లొచ్చాయి. ఇక నాదెండ్లకు వచ్చిన ఓట్లు సుమారు 30 వేలు. మరి ఈ లెక్కలు చూస్తే టీడీపీ, జనసేన తరపున ఎవరు పోటీలో ఉండాలో తేల్చటం తేలికే. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే జనసేనలో అధినేత పవన్ కల్యాణ్ తర్వాత అంతటి కీలకమైన వ్యక్తి నాదెండ్ల మాత్రమే. కానీ చంద్రబాబుకు ఆలపాటి లాంటి వాళ్ళు చాలామందున్నారు. అయితే నాదెండ్ల పోటీచేస్తే గెలుస్తారో లేదో తెలీదు. అందుకనే ఇక్కడ టికెట్ ఎవరు దక్కించుకుంటారనే విషయం ఆసక్తిగా మారింది.