అమరావతి : నాగబాబు ఓవరాక్షన్ మామూలుగా లేదుగా
వారాహి యాత్ర నేపధ్యంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పెద్ద ప్రెస్ నోట్ జారీచేశారు. అందులో విప్లవ శంఖారవమని, రాజకీయ అనిశ్చితిని, చారిత్రక ఘట్టమని చాలా చాలా మాటలు చెప్పారు. విప్లవాత్మకమైన మార్పుకోసం రాజకీయ శంఖారావటం పూరించబోతున్నట్లు చెప్పారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేయబోయే వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోందట. వారాహి యాత్రకోసం జన సైనికులు, వీరమహిళలు, నాయకులు, జనసేన నేతలు, యాత్రకోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు.
పార్టీకి జెండా తప్ప ఇంకేమీలేదు. అజెండా లేదు, మ్యానిఫెస్టో రెడీకాలేదు. ఎన్నిసీట్లలో పోటీచేస్తారో తెలీదు. పోటీచేసే సీట్లేవో కూడా చెప్పలేరు. పోటీసంగతిని పక్కనపెట్టేస్తే నియోజకవర్గాలకు కనీసం ఇన్చార్జిలు కూడా లేరు. రాష్ట్రకార్యవర్గాన్నే ఇంతవరకు ఏర్పాటుచేసుకోలేకపోయారు. వీటన్నింటికీ మించిన మైనస్ ఏమిటంటే అసలు పార్టీకి ఎన్నికల గుర్తేలేదు. అయినా రాజకీయ విప్లవ శంఖారావమని నాగబాబు ప్రకటించటమే పెద్ద జోక్ గా ఉంది.
వారాహి యాత్ర ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదాపడి చివరకు ఈనెల 14వ తేదీన మొదలవ్వబోతోంది. ఇందులో రాజకీయ సంచలనం ఏముందో అర్ధంకావటంలేదు. జనాలంతా ఇపుడు కలిసిమెలసి జీవించే పరిస్ధితి రాష్ట్రంలో లేదని నాగబాబు తెగ బాధపడిపోయారు. మరి నాగబాబుకు ఎందుకు అలా అనిపించిందో ? జనాలంతా కలిసిమెలిసే కదా ఉంటున్నారు. కులాల వారీగా, మతాల వారీగా జనాలేమీ విడిపోలేదే. ఇక రాజకీయ అనిశ్చితి ఉందని నాగబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది.
రాజకీయ అనిశ్చితి ప్రతిపక్షాల్లోనే కనబడుతోంది. ఎవరితో ఎవరు పొత్తుపెట్టుకోవాలో కూడా తేల్చుకోలేకపోతున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీచేయాలని పవన్ అంటున్నారు. టీడీపీ, జనసేన, వామపక్షాలు పొత్తు పెట్టుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణంటునారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డే సీఎం అవుతారని చెప్పారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని చంద్రబాబుకు బలంగా ఉన్నా తమ్ముళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు తమ్ముళ్ళయితే అసలు జనసేనతో కూడా పొత్తు వద్దంటున్నారు.
ఇక ప్రభుత్వపరంగా అయితే ఎలాంటి అనిశ్చితి లేదు. 151 సీట్లతో వైసీపీ ప్రభుత్వం స్ధిరంగా ఉంది. అసలు ఎన్నిసీట్లలో పోటీచేస్తారో తేల్చుకోలేని అనిశ్చితి జనసేనలోనే కనబడుతోంది. బీజేపీని కాదని టీడీపీతో పొత్తుపెట్టుకునే ధైర్యం పవన్ లో కనబడటంలేదు. ఉండాల్సినంత అనిశ్చితి జనసేనలోనే పెట్టుకుని రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉందని చెప్పటం నాగబాబుకే చెల్లింది. అందుకనే నెటిజన్లు నాగబాబును ఫుల్లుగా ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లను నాగబాబు చూస్తున్నారా ?