అమరావతి : తమ్ముళ్ళని జనసేన రెచ్చగొడుతోందా ?

Vijaya



జనసేన నేతల వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తర్వాత అంతటి స్ధాయిలో ఉన్న నాదెండ్ల మనోహర్ ఎక్కడ పర్యటించినా, ఎవరితో మాట్లాడినా రాబోయేది జనసేన ప్రభుత్వమనే అంటున్నారు. ఎవరైనా సమస్యలు చెప్పుకుంటే జనసేన ప్రభుత్వం రాగానే అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. పార్టీనేతలు, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా మన ప్రభుత్వం రాగానే అన్నీ హామీలను పవన్ అమలుచేస్తారంటు పదేపదే చెబుతున్నారు.



తాజాగా సొంత నియోజకవర్గ తెనాలి పర్యటనలో కూడా జనసేన ప్రభుత్వం రాగానే అన్నీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఇదంతా చూస్తున్న తమ్ముళ్ళకి బాగా మంటెక్కిపోతోందట. ఒకవైపు తమతో పవన్ పొత్తుకు అర్రులు చాస్తు, ఒంటరిగా పోటీచేస్తే వీరమరణమే అని చెప్పుకుంటున్న విషయాన్ని తమ్ముళ్ళు గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించమని అడిగే అర్హత కూడా తనకు లేదని పవన్ బహిరంగంగా చెప్పిన తర్వాత ఇంకా నాదెండ్ల జనసేన ప్రభుత్వమని చెప్పుకోవటం ఏమిటంటు టీడీపీ నేతలు ఎద్దేవాచేస్తున్నారు.



నాదెండ్లతో పాటు ప్రధానకార్యదర్శి నాగబాబు కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. దీంతో తమ్ముళ్ళు ఇటు నాదెండ్ల అటు నాగబాబు ఇద్దరిపైనా మండుతున్నారు. సొంతంగా పోటీచేసి అధికారంలోకి వస్తే ఏర్పడేది జనసేన ప్రభుత్వమే కాని పొత్తులో పదిసీట్లు తీసుకుని పోటీచేస్తే జనసేన ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందో చెప్పాలంటు ఎగతాళి చేస్తున్నారు.



మొత్తానికి తమ్ముళ్ళు ఎంతగా ఎగతాళిచేసినా పర్వాలేదు తాము ఏమీ అనుకోము అన్నట్లుగానే ఉంది నాదెండ్ల, నాగబాబు వ్యవహారం. ఎవరితో పొత్తుపెట్టుకున్నా, పదిసీట్లకే పోటీచేసినా, అందులో ఎన్నిగెలిచినా సరే వచ్చేదిమాత్రం జనసేన ప్రభుత్వమే అన్నట్లుగా నాదెండ్ల మాట్లాడుతున్నారు. అందుకనే పవన్ తో పాటు నాదెండ్ల, నాగబాబుకు కూడా పిచ్చి బాగా ముదిరిపోయిందనే అనుకుంటున్నారు. ముందసలు పవన్ ఎక్కడ పోటీచేస్తారో తెలీదు ? ఎక్కడినుండి పోటీచేసినా గెలుస్తారో లేదో తెలీదని మంత్రులు, వైసీపీ నేతలు ఎకసెక్కాలాడుతున్నారు. మరివన్నీ పవన్ పట్టించుకుంటున్నారా ? నాదెండ్ల ఆలోచిస్తున్నారా అన్నదే అర్ధంకావటంలేదు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: