గోదావరి : వారాహి రూటు మ్యాప్ అసలు అజెండా ఇదేనా ?

Vijaya



మొత్తానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఫైనల్ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లాతో వారాహిని పవన్ పరుగులు పెట్టిస్తున్నారు. జూన్ 14న అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజలు చేసిన తర్వాత యాత్ర మొదలవుతుంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో పవన్ మొదటి విడత యాత్ర జరగబోతోంది.  జిల్లాలో 19 నియోజకవర్గాలుంటే ఇందులో 11 చోట్ల పవన్ పర్యటించబోతున్నారు. మరి రెండోవిడత ఎన్ని నియోజకవర్గాల్లో పవన్ పర్యటించబోతున్నారో అప్పుడే చెబుతారేమో.



ఇంతకీ పవన్ తిరగబోయే నియోజకవర్గాలు ఏవంటే ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటి, ముమ్మిడివరం, అమలాపురం, పీ గన్నవరం, రాజోలు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం. ఇపుడు ప్రకటించిన 11 నియోజకవర్గాల్లో రాజోలులో జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్, పాలకొల్లులో టీడీపీ ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లోను వైసీపీ ఎంఎల్ఏలే ఉన్నారు. వీటిల్లో 2019లో పవన్ పోటీచేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గం కూడా ఉంది.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టూర్ షెడ్యూల్ చూసిన తర్వాత పర్యటించబోయే 11 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి జనసేన బాగా ఆసక్తిగా ఉందనే ప్రచారం మొదలైంది. జనసేన పార్టీకి టీడీపీకన్నా ఎక్కువ బలం ఉందనేది జనసేన నేతల వాదన. ఉభయగోదావరి జిల్లాలో జనసేనకు 38 శాతం ఓటుబ్యాంకు ఉందని స్వయంగా పవనే ప్రకటించిన విషయం తెలిసిందే. అంత ఓటుబ్యాంకు ఎలాగుందంటే ఎవరూ సమాధానం చెప్పటంలేదు.



పోయిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు వచ్చిన ఓట్లు 14.84 శాతం. అలాగే పశ్చిమగోదావరిలో వచ్చిన ఓట్లు 11.68 శాతం. రెండుజిల్లాల సగటు ఓట్లశాతం 13. మరిప్పుడు తమ పార్టీ ఓటుబ్యాంకు 38 శాతంకు పెరిగిందని పవన్ ఎలాచెబుతున్నారో అర్ధంకావటంలేదు. తమకు బలమైన ఓటుబ్యాంకు ఉందికాబట్టి ఎక్కువ సీట్లలో తమ పార్టీయే పోటీచేయాలని  పవన్ భావిస్తున్నారట. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లు పవన్ అడగబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇపుడు వారాహి పరుగులు పెట్టబోతున్న నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయాలని పవన్ కోరుకుంటున్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: