ఢిల్లీ : సుప్రిం దెబ్బకు అమరావతి జేఏసీకి దిమ్మ తిరిగిందా ?
సుప్రింకోర్టు తాజా తీర్పుతో అమరావతి జేఏసీ నేతలకు దిక్కుతోచటంలేదు. పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీని అడ్డుకోవాలన్న టార్గెట్ తో కోర్టుల చుట్టూ తిరుగుతున్న జేఏసీ నేతలకు ఫైనల్ గా సుప్రింకోర్టు పెద్ద షాకిచ్చింది. ఆర్-5 జోన్ లో పేదలకు పట్టాలు ఇచ్చుకోవచ్చని ప్రభుత్వానికి సుప్రింకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలాగైనా పేదలకు ఇళ్ళపట్టాలను ఇవ్వకుండా ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు అమరావతి జేఏసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, రైతుల నుండి భూములు కొనుక్కున్న వాళ్ళు శతవిధాలుగా ప్రయత్నాలుచేశారు.
ముందు హైకోర్టులో పిటీషన్ వేసి అర్జంటుగా విచారించాలన్నారు. అర్జంటుగా విచారించటం సాధ్యంకాదని చెప్పిన హైకోర్టు అంత అర్జంటైతే సుప్రింకోర్టుకు వెళ్ళమని చెప్పింది. జేఏసీ వెంటనే సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది. కేసును పరిశీలించిన సుప్రింకోర్టు జేఏసీ అడుగుతున్నట్లు పట్టాలివ్వకుండా స్టే ఇవ్వటం సాధ్యంకాదని తేల్చింది. కేసును హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పింది. దాంతో జేఏసీ మళ్ళీ హైకోర్టులో పిటీషన్ వేసింది. పిటీషన్ను విచారించిన తర్వాత పేదలకు పట్టాలు ఇవ్వకుండా స్టే ఇవ్వటం సాధ్యంకాదని తేల్చేసింది.
దాంతో జేఏసీ హైకోర్టు తీర్పును మళ్ళీ సుప్రింకోర్టులో చాలెంజ్ చేసింది. కేసును విచారించిన సుప్రింకోర్టు బుధవారం పేదలకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు లేదన్నది. పేదలకు పట్టాలు పంపిణీ చేయటం ప్రభుత్వం అధికారమని, బాధ్యతని తేల్చిచెప్పింది. దాంతో జేఏసీ ఇక చేయగలిగేదేమీ లేదు. ఈ విషయాన్ని ఊహించే జేఏసీ ముసుగులో చాలామంది రైతులమని చెప్పుకుంటు ప్రత్యక్ష గొడవలకు దిగుతున్నారు.
పట్టాలపంపిణీకి వీలుగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రైతుల ముసుగులో కొందరు అడ్డుకుంటున్నారు. దాంతో వాళ్ళపైన పోలీసులు కేసులు నమోదుచేశారు. గ్రౌండ్ లెవల్లో ఇంత గందరగోళం సృష్టిస్తున్న సమయంలోనే సుప్రింకోర్టు తీర్పు రావటంతో జేఏసీకి షాక్ కొట్టినట్లయ్యింది. తాజా తీర్పుతో పట్టాల పంపిణీకి మార్గం సుగమమైంది. మొదటినుండి కూడా పట్టాలు పంపిణీ ద్వారా తమ పక్కనే పేదలు ఉండేందుకు లేదన్న వాదననే వీళ్ళు వినిపిస్తున్నారు. మొత్తానికి వీళ్ళ వాదన తప్పని కోర్టులు గట్టిగా చెప్పాయి.